రాష్ట్రంలోని సుప్రసిద్ద నారసింహ క్షేత్రాలల్లో మాల్యాద్రి ఒకటి. దీనినే మాలకొండ అనికూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా, దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామం ప్రక్కనే సుమారు 413 ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఉంది మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. పెద్ద పెద్ద బండలు, కొండలు, గుహలు రకరకాల పండ్ల చెట్లు, పరిమళ పుష్ప వృక్షాలు, రకరకాల అడవి జంతువులు, కోనేరులు... ఇలాంటి అపురూప ప్రకృతి సంపదకు నిలయం ఈ ప్రాంతం.
ఇక్కడ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో మూడు శనివారాలు ఆవు నెయ్యితో పిండి దీపారాధన చేస్తే సంతానప్రాప్తితో పాటు కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. మాలకొండపై ఉన్న తీర్థాలను పవిత్ర తీర్థాలుగా భావిస్తారు.
స్థలపురాణం : పూర్వం శ్రీమహావిష్ణువు భూలోక విహారం చేయానుకున్నాడట తాను విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి, ఒక పూమాల ఇచ్చి పంపించాడట. గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక, మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ కొండపై పూలమాల ఉంచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది.
ఆ తరువాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్య మహాముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్యాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. భూలోకవాసుల పాప ప్రక్షాళన కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండి పోవాలని కోరాడు. అయితే దేవతలు, రుషులు దర్శనార్థం వారంలో ఆరురోజులు, మానవుల పూజలకోసం శనివారం కేటాయింలచాని కోరాడు. అందుకు స్వామి సమ్మతించి ఇక్కడ విగ్రహరూపం దాల్చాడట.
1657లో ఈ ఆలయానికి ముఖమండపం, ఇందులో శివాలయం నిర్మించారు. 1769లో మాలకొండ పర్వతానికి ప్రాకారం కట్టారు.
ఆ ఆరురోజులు … ఒక్క శనివారం తప్పమిగిలిన రోజులలో ఎవ్వరూ స్వామివారి ఆలయం దరిదాపులకు కూడా వెళ్లడానికి సాహసించరు. మిగతా ఆరు రోజుల్లో దేవతలు, రుషులు స్వామి దర్శనంకోసం వచ్చి, తమ నృత్య గీతాలతో ఆయన్ను సేవిస్తుంటారని భక్తుల నమ్మకం. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకుంటారు. శనివారం ఉదయం ఆలయం తలుపు తీసి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఆలయం తలుపులు మూసేసి వెళ్లి పోతారు. ఆదివారం ఉదయం నాటికి ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది.
శనివారం మాలకొండ క్షేత్రం వేలాదిమంది భక్తులతో నిండిపోతుంది. యాదగిరిని తలపిస్తుంది స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని కొంతమంది చేసిన ప్రయత్నంలో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత ఎవ్వరూ ఆ పని చేయలేదు. ఈ క్షేత్రంలో సంతాన వృక్షాలకు ఉయ్యాలను కడితే సత్సాంతానం కలుగుతుందని మహిళల విశ్యాసం.
ఇంద్రుని భార్య శచీదేవి ఒకప్పుడు జ్యేష్టమాసంలో ఆవునెయ్యితో ఈ క్షేత్రంలో దీపారాధన చేసి, నియమ నిష్టలతోల క్ష్మీనరసింహుణ్ధి ఆరాధించిందట. ఫలితంగా ఆమెకు సంతానం కలిగిందని ఒక కథనం. అలాగే సొంత ఇళ్లు కట్టానుకునే భక్తులు ఈ క్షేత్రంలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అలా పేర్చిన రాళ్ళు నిలబడితే తమ సొంతింటి కల నెరవేరుతుందని వారి విశ్యాసం. ఈ క్షేత్రంలో శివుడు, పార్వతీ దేవి, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకపక్క ప్రకృతి సుందర దృశ్యాలు మరోపక్క కోర్కెలు తీర్చి అభయమిచ్చే నారసింహుడు, భక్తులను మాల్యాద్రికి పదే పదే రప్పిస్తుంటాయి.
రవాణా సౌకర్యం: విజయవాడ - చెన్నై ప్రధాన రైలు మార్గంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడినుండి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కందుకూరుకు వెళ్లాలి. కందుకూరు నుంచి ప్రతి శనివారం మాలకొండకు బస్సులుంటాయి. (కందుకూరుకు ఒంగోలు మరియు విజయవాడ నుండి బస్సు సౌకర్యం కలదు) ఒంగోలు నుండి 76 కి.మీ కందుకూరు నుండి 35 కి.మీ. దూరంలో ఉంది మాలకొండ. కొండపైకి ఘాట్‌రోడ్‌తో పాటు మొట్ల మార్గం కూడా ఉంది.
సేకరణ: ఈనాడు ఆదివారం సౌజ్యంతో...