మంగళగిరిలో ఈ స్వామికి రెండు దేవాలయాలు ఉన్నాయి. కొండపైన ఉన్న దేవాలయం పానకాలస్వామి దేవాలయం. క్రింద ఉన్న దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. కొండపైన ఉన్న దేవాలయంలో విగ్రహం ఉండదు. కేవలం నోరు తెరచుకొన్న ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి సమర్పించిన పానకంలో సగం త్రాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదలిపెడతాడని చెబుతారు. అందుకే ఈ స్వామిని పానకాలస్వామి అని అంటారు. ఇక్కడ పానకం నేలమీద పడినా చీమలు, ఈగలు రావు.
దిగువ దేవాలయం : ఇక్కడి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్ధాలు పూర్తి చేసుకున్నది. 11 అంతస్తులతో 157 అడుగు ఎత్తున 49 అడుగుల పీఠభాగంతో ఉంటుంది.1807-09 లో ధరణికోట జమిందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మింపచేశాడు.
బ్రహ్మోత్సవాలు : ఫాల్గుణ మాసం శుద్ధ షష్టి నుండి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగును. (ఫిబ్రవరి-మార్చి)
దేవాలయ వేళలు :శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (దిగువ దేవాలయం) ఉదయం 5 గంటనుండి మధ్యాహ్నం 12.30 వరకు మరియు సాయంత్రం గంటల 4 నుండి గంటల 8-30 వరకు
శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం (కొండపైన దేవాలయం) : ఉదయం గంటల 7 నుండి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే. కొండపైకి ఆటోలు మరియు సొంత వాహనాలలో వెళ్ళవచ్చు.
మంగళగిరికి ప్రయాణ సదుపాయాలు : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మంగళగిరికి బస్ మరియు రైలు మార్గాలో చేరుకోవచ్చు. ఈ పుణ్యక్షేత్రం కకత్తా-చెన్నై 5 నెంబరు జాతీయ రహదారిలో ఉన్నది. విజయవాడకు 13 కి.మీటర్ల దూరంలోను గుంటూరుకు 21 కిలో మీటర్ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, తెనాలి నుండి బస్‌లలో ఇక్కడకి చేరుకోవచ్చు. మంగళగిరిలో రైల్వేస్టేషన్ కూడా ఉంది.అన్ని రైళ్లు మంగళగిరిలో ఆగవు. దగ్గరలోని రైల్వే జంక్షన్ విజయవాడ.