అమరారామం లేక అమరావతి చారిత్రక ప్రసిద్ధిచెందిన శైవ పుణ్యక్షేత్రం. గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో ఉన్నది. ఇక్కడి స్వామివారు అమరేశ్వరుడు. అమ్మవారు బాలచాముండి. ఈ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. అమరారామంలో శివలింగం ఎత్తు 15 అడుగులు ఉంటుంది. శివలింగం చుట్టూ రెండు అంతస్తులు ఉంటాయి. అభిషేకాలు పైఅంతస్తు నుండి జరుపుతారు.
ఇక్కడి శివలింగం దేవతల రాజైన ఇంద్రునిచే ప్రతిష్టించబడినదంటారు. ఈ దేవాలయం కొద్ది ఎత్తులో ఉన్న క్రౌంచగిరి అనే శిల మీద ఉంటుంది. దేవత గురువు బృహస్పతి మరియు రాక్షసుల గురువు శుక్రాచార్యులు ఇక్కడ శివభగవానుడిని సేవించారు. ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ద్రవిడ శిల్పరీతిలో కట్టబడిన ఎత్తయిన గోపురాలున్నాయి. విజయనగర రాజు ఈ దేవాలయ అభివృద్ధికి కృషిచేశారు. అమరావతికి దగ్గరలో ఉన్న ఇప్పుడు ధరణికోట అని పిలువబడే ధాన్యకటకం శాతవాహనుల రాజధాని. 2వ శతాబ్ధంనుండి 3వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతం శాతవాహనుల పరిపానలో ఉంది.
అమరావతిలో అమరావతి స్ధూపంగా పేరుపొందిన బౌద్ధస్థూపాన్ని మరియు గుడికి దగ్గరలో ఉన్న మ్యూజియంను కూడా చూడవచ్చు.
ప్రయాణసదుపాయాలు : గుంటూరు పట్టణానికి 35 కి.మీ. దూరంలో అమరారామం ఉన్నది. గుంటూరు బస్‌స్టాండ్ నుండి నాన్‌స్టాప్ బస్సులు దేవాలయం వరకు వెళతాయి.
విజయవాడ నుండి కూడా బస్సు సౌకర్యం కలదు. దగ్గరలోని రైల్వేస్టేషన్లు గుంటూరు, మరియు విజయవాడ.