header

Draksharamam / ద్రాక్షారామం

ఈ పవిత్ర క్షేత్రం పంచారామాలలో మెదటిది. మరియు త్రిలింగ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం(తూర్పుగోదావరి). దక్షప్రజాపతి యజ్ఞం చేసిన పుణ్యస్థలం మరియు పార్వతీదేవి జన్మస్థలం. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అలాగే ద్రాక్షారామం కూడా ప్రకాశిస్తుందని చెబుతాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. శివలింగం సగం నలుపు రంగులో సగం తెలుపు రంగులో ఉంటుంది
శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామివారిని అర్చించడానికి సప్తర్షులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని అందుకే అంతర్వాహినిగా ప్రవహించే గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. శాతవాహనుల రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి అన్న ప్రాకృత భాషా కావ్యంలో వ్రాశారు.
భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర శివలింగాలు దర్శనమిస్తాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కులో ఉన్న గోపురాలను ఒక్కో అమ్మవారు పర్వవేక్షిస్తున్నట్లుగా స్థలపురాణం వివరిస్తుంది. భీమేశ్వరునికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని చెబుతారు. తూర్పున కోలం, పడమరన వెంటూరు, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైరుతిన కోరుమిల్లి, పశ్చిమాన సోమేశ్వరం, ఈశాన్యంలో పెనుమళ్ళలో ఈ అష్ట సోమేశ్వరాయాలున్నవి.
ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబా దేవి. శ్రీచక్రంతో విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారి దేవేరి పార్వతీదేవి, అష్టాదశ పీఠాలో 12వ పీఠం మాణిక్యాంబా పీఠంగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో శ్రీడుండి విఘ్నేశ్వరుడు, అశ్వర్థనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నటరాజు, వీరభద్రుడు, మహిషాసురమర్ధని, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఆంజనేయస్వామి వారిని కూడా దర్శించవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు.
శ్రీనాధ కవిసౌర్వభౌముడు తన భీమేశ్వరపురాణంలో ఈ క్షేత్రం గురించి విశేషంగా వర్ణిస్తాడు. దుష్యంతుడు, నలమహారాజు, భరతుడు, నహుషుడు ఈ ఆలయాన్ని దర్శించారని వ్రాశాడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమేశ్వరుడు క్రీ॥శ॥ 7-8 శతాబ్దాల మధ్య కట్టించాడు. ఇంకా అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి వివరించారు. ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.
ఆలయం తెరచే వేళలు :
ప్రతిరోజు ఉదయం గం.06-00 ఆలయం తెరవబడుతుంది.
ఉ.గం.06-00 నుండి మ॥ గం.12.00వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
మ.గం.12-15 ని. నుండి సా.గం.03-00 వరకు విరామం
సా। గం.03-00 నుండి రాత్రి గం.08-00 గంట వరకు సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు
రాత్రి గం.08-00 కు గుడి మూసివేస్తారు.
ఎలా వెళ్లాలి ? : ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉన్నది. రాజమండ్రికి 62 కి.మీ. కాకినాడకు 32 కి.మీ దూరంలో ఉంది. రాజమండ్రి నుండి బస్సులలో వెళ్లవచ్చు.