శ్రీరాముడు సీతమ్మవార్ల చేతుల మీదుగా ప్రతిష్టితమైన క్షీరలింగేశ్వరస్వామి ఆలయం క్షీరారామం.ఈ దేవాలయం క్రీ॥శ॥ 10-11 శతాబ్ధాల మధ్య చాళుక్యు రాజులచే నిర్మించబడినది. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తున ఉంటుంది. గోపురం నిర్మించటానికి ఒక్కో అంతస్తు నిర్మించి దాని చుట్టూ మట్టిపోసి దానిమీద రాకపోకలు సాగించి ఇంకో అంతస్తు నిర్మించారట.
అలా తవ్వగా ఏర్పడిన చెరువే రామగండం చెరువుగా పిలుపబడుతుంది. ఇది దేవాలయంనకు దగ్గరలోనే ఉన్నది. శివుడు పార్వతీ సమేతుడై రామలింగేశ్వరుడుగా వెలసిన పుణ్యక్షేత్రం క్షీరారామం. శివలింగం పాలరంగులో మెరుస్తూ భక్తులను పారవశ్యం చేస్తుంది. మహావిష్ణువు ఈ క్షేత్రపాలకుడు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకారమండపంలో పార్వతీదేవి కొలువై ఉన్నారు. పక్కనే శుబ్రహ్మణ్యస్వామి, ఋణహార గణపతి కొలువై ఉన్నారు. ఋణహార గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు తొగిపోతాయని భక్తుల విశ్వాసం. రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారని శాసనాల ద్వారా తెలుస్తుంది.
శివలింగం పైభాగం మొనతేలి ఉండటం వలన ఈ స్వామిని కొప్పురామలింగేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. ఈ శివలింగాన్ని శుబ్రహ్మణ్యస్వామి ఛేదించిన శివలింగం పైభాగంగా భక్తులు విశ్వసిస్తారు. పూర్వం శివభక్తుడైన ఉపమన్యుకోసం శివుడు తన త్రిశూలాన్ని ఇక్కడ గుచ్చగా అందులో నుంచి పాలధార పొంగివచ్చిందని, ఈ కారణం చేతనే ఈ ప్రదేశానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అని పేరు వచ్చిందంటారు. తరువాత కాలంలో క్రమంగా పాలకొల్లు అనే పేరు స్ధిరపడింది.
ఎలా వెళ్లాలి ? : ఈ పుణ్యక్షేత్రానికి రైలు మరియు బస్సు మార్గాలున్నాయి. బస్‌స్టేషన్ ప్రక్కనే దేవాలయం కలదు. పాలకొల్లులో రైల్వేస్టేషన్ కలదు. స్టేషన్ నుండి ఒక కి.మీ. దూరంలో దేవాలయం ఉంటుంది. విజయవాడ నుండి వచ్చేవారు విజయవాడ-నర్సాపూర్ రైలులో ప్రయాణించి పాలకొల్లులో దిగవచ్చు. ఇక్కడకు షుమారు 20 కి.మీ దూరంలో భీమవరం పట్టణం గునుపూడి గ్రామంలో ఇంకొక పంచారామ క్షేత్రం సోమారామం కలదు.
ఇక్కడనుండి నర్సాపురం 25 కి.మీ. దూరంలో కలదు మరియు బంగాళాఖాతం కూడా 20 కి.మీ. దూరంలోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతానుండి భీమవరానికి ఆర్ టి సి వారు బస్సులు నడుపుచున్నారు. భీమవరం నుండి బస్సులో పాలకొల్లుకు చేరుకోవచ్చు.
వసతి సౌకర్యాలు : ఇక్కడ బసచేయగోరే వారికి దేవస్థానం మరియు ఇతర వసతిగృహాలు ఉన్నాయి. దక్షిణభారత వంటకాలు/భోజనం భిస్తాయి. ఇక్కడ మారుతీ ధియేటర్ దగ్గర పేరులేని హోటల్‌లో కుంపటి మీద తయారయ్యే మినపరొట్టె, చింతామణి చట్నీకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి పేరుంది.