header

Kumara Ramam / కుమారరామం (సామర్లకోట భీమేశ్వరాయం)

చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా ఎంతో విశిష్టిత కలిగిన పుణ్యక్షేత్రమిది.చాళుక్య భీమ మహారాజు (క్రీ॥శ 872-921) నిర్మించడం వలనే ఈ క్షేత్రానికి భీమేశ్వరాలయం అనిపేరు వచ్చింది. 13 అడుగుల శివలింగాన్ని దర్శించుకుంటున్నప్పుడు కలిగేది మాములు ఆనందం కాదు శివానందం. మిగతా పంచారామ క్షేత్రాలలో లాగా ఇక్కడ వివాహాది శుభకార్యాలుండవు. స్వామివారి యోగనిద్రకు భంగం కలగకుండా ఉండటానికే ఈ ఏర్పాటని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. చాళుక్యల సంప్రదాయం గోచరిస్తుంది..
ఆలయం చుట్టూ ఇనుపరాతితో కట్టిన రెండు ప్రాకారాలు కలవు. బయట ప్రాకారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు గోపుర ద్వారాలు కనువిందు చేస్తాయి. లోపలి ప్రాకారాన్ని రెండు అంతస్తులతో నిర్మించారు. కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగం రెండస్తుల ఎత్తు ఉంటుంది. మహాశివుడిని అభిషేకించాలంటే రెండో అంతస్తు నుండి చేయాల్సిందే. అప్పటికి గాని రుద్రభాగానికి పూజ పూర్తవుంది. కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడు. కుమారస్వామి,
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దుర్గాదేవి, విష్ణుమూర్తి, బాలాత్రిపురసుందరి అమ్మవారు తదితర ఉపాలయాలు ఉన్నాయి.
వసంత నవరాత్రులు మొదలు మొదట నాలుగు నెలల కాలంలో సూర్యకిరణాలు ప్రభాత కాలంలో మూలవిరాట్టునూ ప్రదోష సమయంలో బాలత్రిపురాసుందరి అమ్మవారిని తాకుతాయి. ఏకశిలా నంది విగ్రహం,ఊయల మండపం, నాటి శిల్ప కళానైపుణ్యానికి తార్కాణాలు. ఊయల మండపాన్ని కాస్తంత ఊపితే కాస్తంత కదుతున్నట్టు ప్రకంపనలు వస్తాయి.
నందీశ్వరుడి వైభవాన్ని చూడాల్సిందే. మొడలో గంటతో, శివలింగమంత మూపురంతో రాజసంగా ఉంటుందీ విగ్రహం. ఆలయ నిర్మాణ సమయంలో శ్రమజీవులకు మజ్జిగ పోసిన గ్లానును మరచిపోకుండా సుమారు యాభై అడుగు ఎత్తున్న గొల్ల స్థంభాన్ని ఏకశిలలో నిర్మించారు. కుమారస్వామి చేతుల మీదుగా లింగప్రతిష్ట జరిగింది కాబట్టి కుమారరామంగా పేరు వచ్చింది.
ఎలా వెళ్ళాలి ? : సామర్లకోట రైల్వే స్టేషన్‌నుండి కిలోమీటరు దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుండి 50 కి.మీ. దూరం. విజయవాడ మరియు విశాఖపట్నం నుండి వెళ్ళేవారు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో దిగవచ్చు.
స్వామి దర్శన సమయాలు: ఉదయం గం.06-00 నుండి మ.12-00 వరకు తిరిగి సా.04-00 నుండి రా.08-00 గంటల వరకు.