శ్రీముఖలింగేశ్వర ఆలయం – శ్రీకాకుళం : ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం. ఆలయం వల్లనే ఈ ఊరుకు శ్రీముఖలింగం అనే పేరు వచ్చిందంటారు. ఈ క్షేత్రంలో మధుకేశ్వర ఆలయంతో పాటు భీమేశ్వర, సోమేశ్వర ఆలయాలను ముక్కోణాకారంలో నిర్మించారు. ఆలయంలో లభించిన శాసనం బట్టి క్రీ.శ 720 నుండి 1450వరకు పాలించిన గంగ వంశీయులైన ఒకటవ కామార్జువుని హయాంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైనట్ల తెలుస్తుంది. ఈ ఆలయంలో గంగ రాజులతో పాటు చాళుక్యుల నాటి శిల్పకళకూడా దర్శనమిస్తుంది. ఆలయం ఎదుట తెలుగు, ఒరియా పద్ధతులలో రెండు నందులను ఒకే పీఠంపై ప్రతిష్టించారు.
కృతయుగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనకాకృతిలోనూ, త్రేతాయుగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృ తిలోను, ద్వాపరయుగంలో జయంతీశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోనూ భక్తుల పూజలందుకున్న పరమేశ్వరుడు కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో శిలాకృతిలో దర్శమిస్తున్నాడని పురాణాల్లో ఉంది.
గోలెం ప్రత్యేకత : ఈ ఆలయంలో మూల విరాట్టు వెనుక భాగాన ఓ పెద్ద మట్టి పాత్ర ఇప్పటికీ ఉంది. ఇది గర్భాలయ వాకిలి కంటే పెద్దది. నాగన్న అనే ఒక కుమ్మరి తనకు పుత్ర సంతానం కలిగితే పెద్ద మట్టిగోలెం తయారు చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన తరువాత మట్టిగోలెం తయారు చేసి దాని నిండా ఆవుపాలు నింపి గర్భాలయంలోపలకి తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తాడు. కాని పాత్ర పెద్దదవటం వలన లోపలకు తీసుకువెళ్ళటం కుదరదు. దాన్ని అలాగే ద్వారం వద్ద వదలి వెళ్ళిపోతాడు. మరునాడు అర్చకులు గుడి తలుపు తెరచేసరికి ఆ గోలెం మూలవిరాట్ వెనుకభాగాన అమరి వుంది,
శిల్పసౌందర్యం : ఈ ఆలయ శిల్పకళ భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయ నిర్మాణ పద్ధతి గోచరిస్తుంది. ఆలయ ద్వారాలపై చక్కని నగిషీలే కాక ప్రధాన గోపురం నాలుగు వైపులా యోగీశ్వరుల ప్రతిమలున్నాయి పైకప్పులో పురాణ గాథలను తెలియచేసే శిల్పాలున్నాయి. గంగాదేవి, మొసలిమీద, యమున తాబేలు మీద మలచిన కలశాలు అద్భుతంగా మలచబడ్డాయి. ముఖ మందపంలో రెండువైపులా పరమ శివుని ఏకాదశ రుద్ర రూపాలున్నవి.ఉత్తర దిశలో దక్షిణముఖంగా వారాహి అమ్మవారు వెలసింది. ఏటా మాఘమాసంలోను, మహాశివరాత్రి తదితర పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు వంశధార నదిలో స్నానం చేసి శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. మహాశివరాత్రి మొదటి రోజు జాగారం, రెండో రోజు పడియా, మూడో రోజు చక్రతీర్థస్నానాలు ఘనంగా చేస్తారు. పాడ్యమి ఘడియల్లో స్వామివారిని నది వాహనంపై ఊరేగింపుగా వంశధార నదిమీద మిరియాలపల్లి రేవకు తీసుకు వెళ్ళి సంప్రదాయంకంగా స్నానం చేయిస్తారు. ఈ సమయంలో లక్షలాది భక్తులు కూడి వంశధార నదిలో స్నానం చేస్తారు.
ఎలావెళ్ళాలి ? రైలు, బస్సులలో వచ్చేవారు శ్రీకాకుళంలో దిగి అక్కడ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం దేవాలయానికి బస్సులలో వెళ్లవచ్చు.