header

Swetchavati Ammavaru..Srikakulam.. స్వేచ్ఛావతి అమ్మవారు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కొలువైన స్వేచ్ఛావతి అమ్మవారు శాంతమూర్తిగా, పిలిచిన పలికే తల్లిగా పూజలందుకుంటోంది. ఆర్తితో కొలిచిన భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లుతోంది. సాక్షాత్తూ నారాయణి స్వయంభూగా వెలసింది ఈ క్షేత్రం
సాధారణంగా గ్రామదేవత అంటే పెద్ద కళ్లూ, చేతిలో ఖడ్గంతో ఉగ్ర రూపిణిగా దర్శనమిస్తుంది. కానీ స్వేచ్ఛావతి అమ్మవారి మూర్తిలో ఈ లక్షణాలు ఉండవు. నారాయణి రూపమే కరుణామూర్తిగా ఇక్కడ పూజలందుకుంటోందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో జంతు బలి నిషేధం. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో రాలేనివారు ఏడాదిలో ఏదో ఒక రోజు కుటుంబంతోసహా వచ్చి అమ్మవారిని పూజిస్తారు.
స్థలపురాణం వేల సంవత్సరాల కిందట ఈ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ అడవికి ఆనుకుని రెండంటే రెండే వీధులతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్న చిన్న ఊరు కావడంతో దీనికి పేరు కూడా లేదు. ఒక సారి ఊళ్లో మశూచి వ్యాధి ప్రబలింది. దీంతో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఆ పరిస్థితిలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో జీవించే రైతు దేవుడి మీద భారం వేసి, పొలం సాగుచేసుకునేవాడు. ఒకరోజు పొలం దున్నుతుండగా, నాగలి భూమిలో ఇరుక్కుపోయింది. ఎడ్లు ఎంత లాగినా నాగలి బయటకు రాలేదు. అతను చుట్టుపక్కల వారిని పిలిచి, వారి సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో నాగలిని అలానే వదిలి, ఎడ్లను ఇంటికి తోలుకుపోయాడు. ఆ రాత్రి గ్రామపెద్ద కలలో అమ్మవారు కనిపించి, నాగలి ఆగిన చోట తాను ఉన్నాననీ, తన పేరు స్వేచ్ఛావతి అనీ చెప్పి అంతర్థానమైంది.
మర్నాడు గ్రామపెద్ద ఊళ్లోవాళ్లతో కలిసి నాగలి ఉన్న చోటుకు వచ్చాడు. అమ్మవారిని ప్రార్థించి, భూమిలో తవ్విచూడగా అమ్మవారు చెప్పిన ఆనవాలుతో రాయి కనిపించింది. దానికే అభిషేకాలు చేసి, పందిరికింద పెట్టి పూజలు ప్రారంభించారు. స్వేచ్ఛావతి అమ్మవారి పేరుమీదుగానే గ్రామానికి స్వేచ్ఛాపురం అని పేరుపెట్టారు. కాలక్రమంలో ఈ ఊరు ఇచ్ఛాపురంగా మారినట్లు స్థానికుల నమ్మకం.
ఈ ఆలయంలో కొలువుదీరిన స్వేచ్ఛావతి అమ్మవారికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాసంబరాన్ని అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు అమ్మవారి అభిషేకంతో ప్రారంభమవుతాయి. అదేరోజు రాత్రి ఒక ఎర్రటి పూలగుత్తిని అమ్మవారి విగ్రహంమీద పెడతారు. 12 మంది వేదపండితులు మంత్రోచ్చాటన చేస్తుండగా, అమ్మవారి తలమీద అలంకరించిన పూల నుంచి ఒక పుష్పం జారి పడుతుంది. అదే అమ్మవారి అనుమతిగా భావిస్తారు. ఆ పుష్పాన్నీ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్నీ స్థానిక గిలాయి వంశీకుల ఇంటి నుంచి తెచ్చిన జంగిడిలో పెట్టి గ్రామానికి తీసుకువస్తారు. అక్కడి నుంచే గ్రామంలోని అన్ని వీధుల్లో నెలరోజులపాటు వీటిని ఊరేగిస్తారు. అనంతరం అమ్మవారి ఘటాన్ని ఆలయానికి చేర్చడంతో సంబరాలు ముగుస్తాయి. మంగళవారాన్ని స్వేచ్ఛాదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు. అందుకే మంగళవారంనాడు ఈ ఆలయంలో ప్రత్యేక పారాయణాలు చేస్తారు. వీటితోపాటు ప్రతీ మాస సంక్రమణం రోజున అభిషేకాలు, సిందూర అర్చన, శాంతిహోమాలు జరుగుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. నవదుర్గల పేరిట రోజుకో రూపాన్ని అలంకరించి, ఆ పేరుతోనే పూజాదికాలు చేస్తారు. శ్రీశైలం భ్రమరాంబికాదేవికీ శ్రీకాకుళంలో కొలువైన స్వేచ్ఛావతి అమ్మవారికీ ఒకేరీతిన అలంకరణా, పూజలూ జరగడం విశేషం.
ఎలా వెళ్లాలి ?
స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకునేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉందీ ఆలయం. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచీ ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.