header

Sri Suryanarayana Temple, Anantapuram / సూర్యనారాయణ స్వామి దేవాలయం, అనంతపురం

సూర్యభగవానుడుకి మన రాష్ట్రంలో చాలా కొద్ది దేవాయాలు ఉన్నాయి. అందులో ఓ ప్రత్యేకమైన దేవాలయం అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూదగవిలో ఉంది. అతి ప్రాచీన ఆలయాల పోలికలో ఉండే ఈ ఆలయం గురించి ఊరంతా గొప్పగా చెబుతారు.
ఆలయ విశేషాలు : ఆలయం మొత్తం దీర్ఘ చతురస్రాకారంగా మూడు పెద్ద బండరాళ్ళ వరుసమీద నిర్మించబడినది. చూసేవారిని ఆకట్టుకునేది ఈ ఆలయ నిర్మాణ చాతుర్యమే.
ఈ ఆలయాన్ని 13వ శతాబ్ధంలో చోళులు నిర్మించారని చరిత్రను బట్టి తెలుస్తుంది. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవతామూర్తి తూర్పుదిక్కుగా ఉంటుంది. ప్రత్యేకించి సూర్య దేవాయాలలో అయితే స్వామి తూర్పు ముఖంగానే ఉంటాడు. కాని ఇక్కడ అందుకు భిన్నంగా సూర్యనారాయణుడు దక్షిణదిక్కు వైపు ఉండి పూజలందుకుంటున్నాడు. శాస్త్రప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. యముడు సూర్యని కుమారుడే. అందుకే ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదంటారు. దక్షిణాభిముఖంగా పూజలందుకునే ఈ స్వామి అపమృత్యుభయాన్ని పోగొడతాడంటారు.
ఆలయంలోని మరో విశేషం ఆంజనేయుని నమస్కార భంగిమ. హనుమకు గురువు సూర్యనారాయణుడే. తనకు సకల విద్యలు నేర్పిన ఆదిత్యణ్ణి తాను నిత్యం పూజిస్తానని చెప్పేందుకే సూర్యనారాయణుకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లుగా హనుమంతుని ప్రతిమ ఉంటుంది.
సూర్యనారాయణుని విగ్రహాన్ని నల్లరాతితో తయారు చేశారు. కళాకాంతు ఉట్టిపడే ఈ విగ్రహం పరిశీలనగా చూస్తే త్రిమూర్తుల రూపాలు ఉంటాయి. మొదటిగా పైన విష్ణు రూపం అనగా వేంకటేశ్వరుని నుదురుమీద ఉండే నామాలు ఉంటాయి. కొంచెం కిందికి వస్తే పానపట్టంతో కూడిన శివలింగం కనిపిస్తుంది. దానికి కిందగా చతుర్మఖ బ్రహ్మకు ప్రతిరూపంగా అడ్డబొట్టు ఉంటుంది. స్వామి దక్షిణాభిముఖంగా ఉండటం వలన సూర్యకిరణలు నేరుగా పడకుండా కాంతి మాత్రం గర్భగుడిలోని స్వామిపై ప్రతిఫలిస్తుంది. ఈ కాంతి ముందు బ్రహ్మ రూపంపై తరువాత లింగంపై చివరిగా నిలువు నామంపై పడుతుంది.
100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఆలనా పాలనా కరువైన పరిస్ధితులో, అనంతపురానికి చెందిన ప్రవాసభారతీయుడైన అనంతరామశర్మ 2009లో ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో మల్లిఖార్జునస్వామి ఆలయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఆలయాల్లో నిత్యపూజలు జరుగుతున్నాయి.
ఎలా వెళ్ళాలి : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బూదగవి గ్రామంలో ఈ ఆలయం ఉంది.