కర్నూలు జిల్లా, నందికొట్కూరులోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్నాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య ప్రాతఃకిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో శూన్యయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతుంటారు.
స్థలచరిత్ర : 13వ శతాబ్ధంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చి అలసిసొలసి ఓ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి... ఇక్కడ తనకో ఆలయాన్ని కట్టించవసినదిగా ఆదేశించాడంటారు. సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని కథనం.
ఆలయవిశేషాలు : గర్భాలయంలో మూలమూర్తి వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. చోళుల పాలన తరువాత కూడా చాలామంది రాజులు స్వామివారిని కొలిచారు. కాలక్రమంలో దేవాయం శిధిలావస్ధకు చేరుకుంది.
2014 సం.లో భక్తులందరూ తలో చేయివేసి జీర్ణోద్ధరణ కావించారు. ఆదివారం వచ్చే అమావాస్యను భాను అమావాస్య అంటారు. భాను సప్తమి కూడా అంతే ప్రత్యేకమైనది. ఆరోజుల్లో భాస్కరుని విశేష పూజలతో కొలుస్తారు. సూర్యగ్రహ శాంతులు. హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలు నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడుకి చాలా ఇష్టం. వీటినే ఆర్క పత్రాలనీ అంటారు. రథసప్తమినాడు స్వామివారి ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లా నుండి కూడా భక్తులు వస్తారు.
రథసప్తమి : మాఘశుద్ధ సప్తమి నాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథం ఎక్కి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్య వ్రతాన్నీ నిర్వహిస్తారు. ఆరోజు తలమీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తలస్నానం చేయడం సంప్రదాయం కొత్త బియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని , చిక్కుడు ఆకుమీద వడ్డించి నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేలేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం పలుకుతారు. ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యకటాక్షం పొందుతారు.
రథపస్తమికి వాతావరణం పరంగా కూడా ప్రాధాన్యత ఉంది. నాటితో సూర్యగమనంలోనూ మార్పు వస్తుంది. శీతాకాలం నుంచి వసంత, గ్రీష్మ రుతువు దిశగా మార్పు సంభవించే సమయమూ ఇదే. రథసప్తమి నాటి బ్రహ్మీ ముమూర్తంలో ఆకాశంలోని ప్రధాన నక్షత్రాన్నీ తేరు(రధం) ఆకారంలో అమరిపోయి సూర్యరథాన్ని గుర్తుకు తెస్తాయంటారు. సూర్యుడికి సంబంధించినంత వరకూ ఏడు చాలా విశిష్టమైన సంఖ్య.
సప్తమి ఏడో రోజు సూర్యుడి గుర్రాలు ఏడు సూర్యకాంతిలోని వర్ణాలు కూడా ఏడు. సూర్యారాధన చాలా ప్రాచీనమైనది. సూర్యుడిని స్తుతిస్తూ అనేక రుక్కున్నాయి. వివిధ ఆదిమ తెగల్లో సూర్యారాధన ఉంది. భారతీయలు అన్న మాటకు సూర్యారాధకులు అనే అర్థము ఉందంటారు. రామాయణంలో శ్రీరాముడు ఆదిత్య హృదయ పారాయణ తర్వాతే రావణ సంహారం చేశాడు. ఆంజనేయుడు భాస్కరుడి వద్దే విద్యాభ్యాసం చేశాడు. భాగవతంలో శత్రాజిత్తుకు శమంతకమణిని కూడా ఇచ్చింది సూర్యుడే. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది సూర్యుణ్ణి ప్రార్ధించి అక్షయ వరాన్ని పొందింది.
సూర్య నమస్కారాులు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని ఆధునిక పరిశోధనలు అంగీకరిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి.
ఎలా వెళ్ళాలి : కర్నూలు జిల్లాలోని కర్నూలు పట్టణానికి నందికొట్కూరు సూర్యదేవాలయం 30 కి.మీ. దూరంలో ఉంది. బస్సులలో వెళ్ళవచ్చు