మూడుకళ్ళతో తండ్రిపోలికతో , చేతులు మహాశక్తిని తలపించేలా పది చేతులు. చేతిలో సుదర్శనం......అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి విలక్షణమైన రూపం చూడవలసిందే...
మూమూలుగా గణపతి రూపానికి అనంతపురం రాయదుర్గంలోని కొలువై ఉన్న గణపతి రూపం కాస్త భిన్నంగా ఉంటుంది. స్వామి ఇక్కడ మహాకాయుడిగా దర్శమిస్తాడు. పదిహేను అడుగుల ఎత్తుతో, పన్నెండు అడుగుల వెడల్పుతో దర్శనమిస్తాడు. ఇక్కడ గణపతికి పదిచేతులుంటాయి. ఎడమవైపు అయిదు, కుడివైపు అయిదు చేతులతో ఒక్కోచేతిలో ఒక్కో ఆయిధంతో ....కుడివైపు చేతులలో కొబ్బరికాయ, సుదర్శనం, త్రిశూలం, ధనస్సు, అంకుశం ఉంటాయి. ఎడమవైపున చేతులలో భార్య సిద్ధి, శంఖం, పవిత్రం, బాణం. ఖడ్గంతో దర్శనం ఇస్తాడు. ఇంకో విశేషం ఫాలభాగాన శివునిలాగే మూడోకన్ను, కాలికి గజ్జెలు, కాలికింద మూషికవాహనంతో చాలా ప్రసన్నంగా కనిపిస్తాడు. పదిచేతులుండటంతో దశభుజుడుగా పిలువబడతాడు.
స్వామి విగ్రహానికి కుడివైన సూర్యుడు, ఎడమవైపున చంద్రుడు ఉంటారు. చేతిలోని నారికేళాఫలం సుఫలాలకు ప్రతీక. భక్తులు మొక్కులు మొక్కుకునే ముందు ముందుగా కొబ్బరి కాయలు సమర్పిస్తారు.
ఈ గణపతి ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్ధంలో భూపతిరాయలు అనే ఈ ప్రాంతాన్ని పరిపాలించే పాలకుని చేత కట్టించబడినట్లు తెలుస్తుంది.
అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాయదుర్గం. బళ్ళారికి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోని రాయదుర్గంలోని ఈ దేవాలయం ఉంది.