స్వయంభుగా వెలసి వేలాదిమంది భక్తుల కోర్కెలను క్షిప్ర ప్రసాదిగా నెరవేరుస్తూ, ఎంతోమంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం శ్రీ శ్వేతార్క మూల గణపతి.
శ్వేతం అనగా తెలుపు, ఆర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. నారదాది పురాణ గ్రంధాలలో తెల్లజిల్లేడు వృక్షం పరిపూర్ణంగా వందేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఆ వృక్ష మూలంలో గణపతి ఆకృతి ఏర్పడుతుందని చెప్ప బడింది. శ్వేతార్క గణపతి గొప్పతనం, వైశిష్టం గణపతి ఉపనిషత్‌లో కూడా తెలియజేయబడింది. .
కేవలం గరికతో మాత్రమే ప్రదక్షిణాలు చేస్తూ సంకల్ప సిద్ధిని పొందుతూ అనేకమంది భక్తలకు అభయమిస్తూ సకల కార్యసిద్ధి నొసగే స్వామిగా వెలుగొందుచున్న ఈ శ్వేతార్క మూల గణపతి సర్వావయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడాలు, మలచడాలు లేకుండా స్పష్టంగా కళ్ళు, నుదురు, దంతాలు, జ్ఞానదంతం, కాళ్ళు, పాదాలు, చేతులు, తల్పం, సింహాసనం, మూషికం, మోదకాలతో అకృతిని పొంది దర్శనమిస్తున్నారు. .
ఈ శ్వేతార్క గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపుకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లుగా సమస్త వాస్తు దోష నివారకుడిగా ఉండటమే ఈ స్వామిలోని విశిష్టత. .
ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా ఈ స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి, ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో పద్దెనిమిదిన్నర కిలోల వెండితో కవచాన్ని తయారుచేసి స్థిరప్రతిష్ట నేర్పరచటం జరిగింది. మంగళవారం నాటి దర్శనం, ప్రదక్షణలు చేయటం ఇక్కడి విశేషం. ప్రతి మంగళవారం గణపతి మూల మంత్రసహితంగా మోదకములతో గణపతి హోమం, రుద్రహవనమును విశేషించి జరుపుతారు. .
ఎలా వెళ్లాలి ?.... .
శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం హైదరాబాద్ కు 120 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలోని కాజీపేటలోని విష్ణపురిలో ఉన్నది. హైదరాబాద్ – విజయవాడ రైలుమార్గంలో కాజీపేట రైల్వే జంక్షన్ ఉన్నది.