తెలుగు రాష్ట్రాల్లోకి వలస పక్షులు సాధారణంగా అక్టోబరు మాసాంతంలో వస్తుంటాయి. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి మృగశిర కార్తె సమయంలోనే వచ్చేస్తాయి.
గూడబాతులు, ఎర్రకాళ్ల కొంగలు, రివ్వు పిట్టలు, నీటికంజులు, లకుమికి పిట్టలు ఇలా పదుల రకాల పక్షులు జులైలో పుణ్యక్షేత్రం సందర్శనకు వస్తాయి. ఇక్కడి చెరువు గట్టుపై తిష్ట వేస్తాయి. సంతానోత్పత్తి చేస్తాయి. డిసెంబరు-జనవరి నెలల్లో తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ విదేశీ పక్షులు వస్తూ వస్తూ వానమబ్బులను తీసుకువస్తాయని స్థానికుల విశ్వాసం. వాటి రాకతో వర్షాలు మొదలవుతాయని నమ్ముతారు. వీటిని అదృష్ట దూతలుగా భావిస్తారు. ఇక్కడున్నన్ని రోజులు పక్షులకు ఏ హానీ కలగకుండా కనిపెట్టుకు చూసుకుంటారు.
ఇందుకోసం ఎప్పుడూ ఇద్దరు కాపలా ఉంటారు. ఎవరైనా పక్షులకు హాని తలపెడితే వారికి జరిమానా కూడా విధిస్తారు. ఇంత జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టే.. ఏటా గుంపులు గుంపులుగా పక్షులు పుణ్యక్షేత్రానికి వస్తుంటాయి. ఈ పక్షులు ఆవాసంగా మలుచుకున్న చెట్టుకు ఆ తర్వాత పూలు, కాయలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎలా వెళ్లాలి...?: పుణ్యక్షేత్రం... రాజమండ్రి నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలు, సొంత వాహనాల్లో వెళ్లొచ్చు.