గేదె లేక ఆవు ఈనినపుడు కొన్ని పాలు దూడకివదిలి మిగిలినవి పిండి ఆ పాలతో జున్నును తయారు చేస్తారు. జున్నుపాలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాబట్టి జున్ను పాల(కొలెస్ట్రమ్ మిల్క్)ల్లో శుభ్రమైన బట్టను నానబెట్టి, తరవాత దాన్ని బాగా ఎండబెట్టి, నిలవ ఉంచుకుని ఆ బట్టను మామూలు పాలల్లో ముంచి కూదా జున్ను వండవచ్చు....
ప్రస్తుతం కొన్ని కంపెనీలు జున్ను పాలను పొడి రూపంలో నిల్వ చేసి మరీ విక్రయిస్తున్నాయి. దాంతో ఆ పొడి తెచ్చుకుంటే జున్నును తయారు చేసుకోవచ్చు.
ఆరోగ్యం పరంగా....
మామూలురోజుల్లో పశువులు ఇచ్చే పాలు తెల్లగా ఉంటే ఈనిన నాలుగైదు రోజులవరకూ అవి ఇచ్చే పాలు లేత గోధుమరంగులో ఉంటాయి. జున్ను పాలల్లో రోగనిరోధకశక్తిని పెంచే యాంటీబాడీలు, అత్యధిక సంఖ్యలో ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ ఉండటమే ఆ రంగుకీ ఆ ప్రత్యేక రుచికీ కారణం. వీటిల్లో ల్యాక్టోఫెరిన్, హెమోపెక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లూ పుష్కలమే..
జున్ను లేదా ఆ పాలు రెండూ కూడా మనిషికీ ఆరోగ్యకరమే. ముఖ్యంగా ఈ పాలల్లోని ఇమ్యునోగ్లోబ్యులిన్ అనే యాంటీబాడీ, రకరకాల వ్యాధులకి కారణమయ్యే బ్యాక్టీరియానీ, వైరస్‌నీ నిరోధిస్తుంది. యాంటీబాడీలు కనిపెట్టకముందు పూర్వకాలంలో కొన్నిరకాల బ్యాక్టీరియా కారక వ్యాధులకి ఈ జున్ను పాలనే మందుగా ఇచ్చేవారట. జున్ను పాలు అనేవి సహజ యాంటీబయోటిక్. గేదె లేదా ఆవు ఈనిన ఐదు రోజుల వరకూ ఆ పాలను సేకరించి వాటిని పొడి లేదా సప్లిమెంట్లు, చాక్లెట్ల రూపంలో నిల్వచేస్తున్నారు. ముఖ్యంగా క్రీడాకారుల ఆటల్లో గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకూ ఈ సప్లిమెంట్లను వాడుతుంటారు.
మతిమరపుతో బాధపడే వృద్ధులకీ పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకీ పెద్దలకీ కూడా ఈ జున్నుపాల సప్లిమెంట్లు మందులా పనిచేస్తాయట.
కొలెస్ట్రమ్ మిల్క్‌లో పోషకాలకు కొదవ లేదు.
బొవైన్ కొలెస్ట్రమ్ అని పిలిచే ఆవు ముర్రుపాలతో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి...
∙అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నెలల వయసులో ఉన్న చిన్నారులు, చిన్న పిల్లల్లో తరచూ కనిపించే నీళ్ల విరేచనాలను అరికడుతుంది ∙హెచ్‌ఐవీ రోగులు, ఎముక మూలుగ మార్పిడి చికిత్స తీసుకున్న వారితో పాటు వ్యాధి నిరోధక శక్తి లేని అనేకమందికి వ్యాధి నిరోధక శక్తిని కల్పిస్తుంది.
∙జంపింగ్, సైక్లింగ్, పరుగు వంటి క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్‌కు అవసరమైన శక్తి కలిగిస్తాయి. క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంచుతుంది ∙శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిముల నుంచి (ఉదాహరణకు జలుబుకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజా) రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ∙నాడీవ్యవస్థలో కలిగే లోపాలను నివారిస్తుంది ∙కాలిన గాయాలను త్వరగా మాన్పుతుంది ∙మూడ్స్ బాగుండేలా తోడ్పడుతుంది ∙కొందరికి ప్రయోణాల్లో వచ్చే నీళ్లవిరేచనాలు (ట్రావెల్ డయేరియా)తో పాటు ఏవైనా నొప్పినివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీస్) వాడినప్పుడు పేగుల లైనింగ్ దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది.
ఇలాంటి చిన్న చిన్న అంశాల్లోగానే గాక కాస్త సీరియస్ వ్యాధులుగా పరిగణించే ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలార్ ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) వంటి జబ్బుల తీవ్రతను తగ్గించడమే గాక, రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను కొలెస్ట్రమ్ సమర్థంగా తగ్గిస్తుందనీ, ఒంట్లోని హానికారక కీటోన్ బాడీస్‌ను హరిస్తుందని తేలినందువల్ల దీన్ని టైప్–2 డయాబెటిస్‌కూ ఔషధంగా వాడవచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఆవు ముర్రుపాల (బొవైన్ కొలెస్ట్రమ్) నుంచి అనేక రకాల ఔషధాలను రూపొందించవచ్చని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.