మునగ – తల్లిపాలను పెంచుతుంది.
విలువైన ప్రోటీన్స్(మాంసకృత్తులు), ఖనిజాలు విటమిన్లు మునగకాయలో పుష్కలం. కాయలే కాదు మునగ ఆకులో కూడా ఇవి లభిస్తాయి. కొద్దిగా వెనుకటి కాలంలో మునగ ఆకుతో కూరలు చేసుకొనేవారు. అంతే కాదు మునగ ఆకును వైద్యపరంగా కూడా నేటి పల్లెలలో వాడటం ఇప్పటికీ చూడవచ్చు.
మునగలో ఎక్కువగా లభించే క్యాల్షియం, ఇనుము ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ముఖ్యంగా పిల్లలకు మంచి ఆహారం. కూరలలో మునగను తిన్నా, సూపులలో, సాంబారులో వాడినా పిల్లల ఎముకలు దృఢంగా మారతాయి.
రక్తశుద్ధి జరుగుతుంది
మునగలో ఉండే గింజలు, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధిచేస్తాయి. మునగ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మునగను తరచుగా వాడటం వలన మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచటం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల మీద మునగ ప్రభావం చూపించి తగ్గేలా చేయగలదు.
గర్భం దాల్చినపుడు మునగను కాయలు లేక ఆకుల రూపంలోను (కూరలుగా) తీసుకొనటం వలన ప్రసవానంతర సమస్యలు తగ్గుతాయి. పాలిచ్చే తల్లులు మునగను తరుచుగా తినటం వలన తల్లిపాలు పుష్కలంగా పడతాయి. మునగ ఆకులలోనూ, మునగ పూలలోనూ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విటమిన్ సిని కూడా కలిగి ఉంటుంది. విటమిన్ సి వలన ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తికూడా పెరుగుతుంది.