డా. కె. ఉమాదేవి. ఫ్రోఫెసర్, నూటకనిషన్ కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, ఎన్.జి.రంగా వర్సిటీ, హైదరాబాద్
మనకు ఆహారమంటే శక్తి! పిండిపదార్థాలు. మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటిగురించే ఎక్కువగా మాట్లాడతాం... వీటి గురించే ఎక్కువగా వింటుంటాం.. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న పీచు గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు.
వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటి చెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా... గుండెజబ్బులు రాకుండా.. కొలస్ట్రాల్ పెరగకుండా. మధుమేహం రాకుండా... ఊబకాయం రాకుండా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదు. మన అన్నం పళ్ళాన్ని నానా రకాల జంక్‌ఫుడ్ ఆక్రమించేస్తున్న ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ పీచును ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతుంది.
ఎంత పీచు అవసరం? మనం తీసకునే ఆహారంలో రోజుకి 40-45 గ్రాముల పీచు ఉండడం అవసరం. ఇందులో కరిగేపీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు అవసరమే కానీ... కొందరు ప్రత్యేకించి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మలబద్దకంతో బాధపడేవారు, మధుమేహులు, గుండెజబ్బున్న వాళ్లు, స్థూలకాయులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లు ఎక్కువగా ఉండేవాళ్ళు. మాంసాహారం తరచు తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి. తరచూ విరేచనాలకు వెళ్ళాల్సివచ్చే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్ బాధితులు సబ్జాగింజలు వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి వెంటనే మలవిసర్జన జరగకుండా కొంతసేపు పట్టి ఉంచడానికి దోహదం చేస్తాయి. త్వరత్వరగా విరేచనం కాకుండా, నీటినని పట్టి ఉంచడం వల్ల నీళ్ళ విరేచనాలూ ఎక్కువ కావు.
గర్భిణీలకు మలబద్దకం తలెత్తే అవకాశం ఎక్కువ. వీరికి పీచు ఎంతో మేలు చేస్తుంది. పీచు శాకాహారంలో ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్థాలు తీసుకున్న ప్రతి సారి తగినంతగా నీరు కూడా తాగాలి. పిల్లలకు కూడా పీచు అవసరమే కానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపు నిండినట్లై ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతో శక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్థాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి. వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పైకి పెద్దగా ఏమీ కనబడదు కానీ, అనాస పండులో కంటే సపోటా పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే కాయగూరల్లో కంటే ముడిధాన్యం, పొట్టుపప్పుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం.
పప్పులతోపోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుంది గానీ.. మనం పప్పులకంటే పరిమాణంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోగలం
కాబట్టి మన ఆహారంలో కూరగాయల ద్వారానే ఎక్కువగా పీచు వస్తుంది. పోషకాహారం అంటే.. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాల వంటివే కాదు.. పీచు పదార్థాన్ని కూడా ముఖ్యమైన పోషక వనరుగా గుర్తించాల్సిన అవసరం వచ్చేసింది. గత 20, 30 ఏళ్ళనుంచీ మన ఆహారంలో పీచుకు ప్రాముఖ్యం పెరుగుతూ వస్తోంది. పీచు పదార్థానికీ పోషకప్రాధాన్యం ఉందని, జీర్ణప్రక్రియలోనూ, జీవ క్రియల్లోనూ దీని పాత్ర అమూల్యమని అధ్యయన పూర్వకంగా గుర్తిస్తున్నారు.
పీచు - పలు రకాలు... పిండిపదార్థాలు... కొవ్వు పదార్థాలు.. మాంసకృత్తులు... వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని జీర్ణం చేసేసుకుంటుంది. కానీ పీచు ఇలా పూర్తిగా జీర్ణం అయిపోదు. అందుకే దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది. ఈ పీచు-జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగుల ద్వారా ప్రయాణించి మలం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆహార నిపుణులు చాలాకాలం పాటు ఈ పీచును... ఓ ముడి పీచుగానే భావిస్తూ... అది ఎందుకూ పనికిరాదని నమ్మేవారు. అందుకే చాలాకాలం పీచు మీద పెద్దగా అధ్యయనాలు జరగలేదు. మన అవగాహన అంతగా పెరగలేదు. అయితే పీచు ప్రయోజనాలు బయటపడుతున్నకొద్దీ మరింత లోతుగా అధ్యయనాలు చేసి పీచులో ప్రధానంగా 2 రకాలు ముఖ్యమైనవని నిర్ధారణకు వచ్చారు.
కరగని పీచు : మన ఆహారంలోనే ఉంటుంది కానీ.. నీటిలో కరగని రకం పీచు ఇది. దీన్ని ఇన్‌సాల్వబుల్ ఫైబర్ అంటారు. ఇది జీర్ణంకాదు. విసర్జన ద్వారా అలాగే బయటకు వెళ్ళిపోతుంది. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఉంటే సెల్యులోజ్ అనే ముతరకరమైన పీచు. దానికన్నా కొద్దిగా పల్చగా ఉంటే హెమీ సెల్యులోజ్, లిగ్నన్స్ వంటి ఈ తరహావి. దీని వల్ల మలం పరిమాణం పెరుగుతుంది. జీర్ణవ్యవస్థలో ఆహారం కదలికలూ పెరుగుతాయి.