తామర గింజలతోపాటు తామరతూళ్లు- అంటే కాడల్లోపలి భాగాన్నీ వేళ్లలోని దుంపభాగాల్నీ ఆహారంగా వాడతారు. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీటి వాడకం ఎక్కువ. అందుకే అక్కడ వీటిని ప్రత్యేక కొలనుల్లో పెంచుతారు.
పైగా దుంప వేళ్లు, గింజలు, పువ్వులు... ఇలా ఒక్కోభాగంకోసం ఒక్కో రకం మొక్కను పెంచుతారు. చైనాలో దుంపలకోసమైతేనేం, గింజలకోసం అయితేనేం, సుమారు ఏడు లక్షల యాభై వేల ఎకరాల్లో తామరను పెంచుతారు.
వేయించిన తామరగింజలే ఫూల్ మఖానా. ఈ గింజల్ని కూరలతోబాటు, పిండి పట్టించి కేకులూ ఐస్‌క్రీముల్లో వాడుతుంటారు.
తామరపూలలో కూడా విటమిన్లూ ఖనిజాలూ ఇతరత్రా పోషకాలూ లభ్యమవుతాయి. అందుకే పూరేకుల్ని గ్రీన్ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గడంతోబాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. .
తామర ఆకుల్లోనూ బోలెడు పోషకాలు. పైగా పద్మ రేకుల్ని ఫుడ్ డెకరేషన్‌లో వాడితే, కొన్ని రకాల వంటకాల్ని ఉడికించేందుకు తామరాకుల్ని ఉపయోగిస్తారు. దుంపల్లోనూ కాడల్లోనూ సి-విటమిన్ ఎక్కువ. దుంపల్ని ఉడికించి
వీటిని తిన్నా, సూపులా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోయేవాళ్లకి ఇవి ఎంతో మేలు. అయితే గింజల్లో పోషకాలు ఎక్కువ. వీటిలో ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ దొరుకుతాయి. బి, బి2, బి6,
ఇ-విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి. గింజల్లోని సంక్లిష్ట పిండిపదార్థాలూ పాలీఫినాల్సూ బీపీ, పిత్తాశయ రాళ్లూ, మధుమేహమూ మంటా తగ్గడానికి తోడ్పడతాయి. .
గింజల్లోని నెఫెరిన్ అనే పదార్థానికి క్యాన్సర్‌ను నిర్మూలించే శక్తి ఉందనేది తాజా పరిశోధన.
.
తామరమొక్క భాగాలన్నింటినీ తరతరాలనుంచీ ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు.
మృదువైన చర్మసౌందర్యంకోసం లినోలిక్ ఆమ్లం, ప్రొటీన్లూ ఇతరత్రా పదార్థాలూ ఉండే పద్మదళాలను ఫేషియల్ క్రీముల తయారీలో వాడతారు. .
అలాగే పూల తైలం మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుంది. .
ఆయురారోగ్యాల్నీ పంచి ఇచ్చే కమలం, మానవాళికి మనోవికాసాన్నీ కలిగిస్తుంది.