పోషకాల గని....బఠానీలు
కాలక్షేపానికి తింటాం కానీ ఇవి మంచి పోషక నిల్వలు అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా పచ్చి బఠాణీలు ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. ఆరోగ్యకరమైన పోషకాలలో వీటికివే సాటి అంటున్నారు పోషకాహార నిపుణులు. బఠాణీల పుట్టుక హిమాయాలు. వీటిని మిగిలిన వాటితో తినటం మాత్రం రెండు మూడు శతాబ్ధాల నుంచి పెరిగింది. ఇటీవల పచ్చిబఠానీలను ఇతర కూరగాయలతో పాటు ఉడికించుకుని తినడం పెరిగింది.
బఠానీల ప్రాముఖ్యత : తింటుంటే పిండి మాదిరిగా ఉండే బఠాణీలలో కార్బోహైడ్రేట్లు మాత్రమే కాదు. పీచు, ప్రొటీన్లూ, విటమిన్లూ, ఖనిజవణాల వంటి పోషకాలు కూడా చాలా ఎక్కువే. పచ్చి బఠాణీల్లో అయితే వీటితోపాటు ఓ ప్రత్యేకమైన ఫైటో న్యూట్రియంట్లూ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో మాత్రమే లభ్యమయ్యే కొమెస్ట్రాల్ అనే ఫైటో న్యూట్రియంట్ ఉదరానికి సంబంధించిన క్యాన్సర్లు రాకుండా కాపాడుతుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పచ్చి బఠానీలలో మాత్రమే దొరికే ఈఫైటో న్యూట్రియంట్లను శాపోనిన్ లు అని పిలుస్తున్నారు. వీటితో పాటు ఫెరూలిక్, కెఫీక్ వంటి ఫినాలిక్ ఆమ్లాలు, కెటెచిన్, ఎపికెటిచిన్ వంటి ఫేవవోనాల్స్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి చక్కెర వ్యాధిని తగ్గిస్తాయంటున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే బీటా సైటోస్టెరాల్ కూడా వీటిల్లో ఉంటుంది.
బఠానీల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
తాజా బఠాణీలు ఫోలిక్ ఆమ్లానికి మంచి నిల్వలు. వంద గ్రాముల బఠానీల్లో 65 మై॥గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది. గర్భం దాల్చాలనుకునే వారు ఫోలేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన పుట్టబోయే బిడ్డలో నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
పచ్చి బఠానీలలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే సి-విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
అరుదుగా దొరికే విటమిన్-కె బఠాణీలతో పాటు ఆ మొక్క యొక్క తాజా ఆకుల్లోనూ ఉంటుంది. ఇది ఎముక నిర్మాణానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణకు దోహదపడే విటమిన్-ఇ కూడా సమృద్ధిగా లభ్యమవుతుంది. కంటిచూపుని మెరుగుపరిచే కెరటోన్, లూటెన్, జియా క్యాంధిన్ వంటి యాంటి ఆక్సిడెంట్స్ వీటిల్లో సమృద్ధిగా ఉంటాయి.
కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలకు ఇవి మంచి నిల్వలే. పచ్చగా మెరిసే పచ్చి బఠాణీలు...మేలైన పోషకాల గని అనడం ఎంతైన సముచితం.