డా పెద్ది రమాదేవి, ఆయుర్వేదిక్ ఫిజీషియన్
సోయా చిక్కుడు జాతికి చెందినది. పిండి, నూనె, టోపు. పాలు, పెరుగు రూపంలో వివిధ రకాలుగా వాడుతుంటారు. అలానే సోయాలో పలు ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. మాంసవృద్థి, నరాల పుష్టికి వీటిలో లభించే మాంసకృత్తులు ఎంతో అవసరం.
కప్పు సోయా గింజల్లో : 240 గ్రాముల మటన్, 180 గ్రాముల చేపలు, ఎనిమిది కప్పుల పాలు, ఆరు గుడ్లకు సమానమైన మాంసకృత్తులు ఉంటాయి. సాధారణంగా మనం తీసుకునే ప్రొటీన్లు కొన్నిసార్లు కడుపులో అజీర్ణం చేస్తుంటాయి. కాని వీటిలోని అమినో ఆమ్లాలు సాఫీగా అరిగిపోతాయి.
ఉపయోగాలు: నిత్యం తీసుకునే ఆహారంలో ఒకవంతు సోయా మిగతా మూడు వంతులు ఇతర ఆహారం చేర్చితే, శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. ముఖ్యంగా శాకాహారులకు దీనిలోని క్యాల్షియం, అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఇనుము ఫోలిక్ ఆమ్లాలు ఎముకలకు, కండరాలకు, కణాభివృద్ధికి సాయపడుతుంటాయి. ముఖ్యంగా హృద్రోగాలు, చక్కెర వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ సోయాను ఆహారంలో తీసుకుంటే కొవ్వు నిల్వలు పేరుకోవు. రక్తంతో చక్కెరశాతం పెరగదు. మసాలా వంటకాలో ఉపయోగించే మీల్‌మేకర్‌ను సోయా పిండితోనే తయారు చేస్తారు.
బరువు తగ్గాలనుకునేవారు కూరల్లో సోయా వేసుకుని తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. పసిపిల్లలకు తల్లిపాలు పడనప్పుడు సోయా పాలను కొంచెంగా ఇస్తే మంచిది. వీటిలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నరాల బలహీనత నిస్సత్తువ, మానసిక ఒత్తిళ్ళు వంటివి బాధించినపుడు సోయా పాలను క్రమంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పాలు, పెరుగు వంటి సంబంధిత పదార్థాలు పడని వారు సోయా పాలు తీసుకోవచ్చు. ఈ పాలను ఎక్కువగా తీసుకొంటే ఈస్టోజన్ అనే హార్మోను తగ్గినపుడు ఏర్పడే శరీర వేడి నరాల బలహీనత, ఎముకల బలహీనత చర్మసమస్యలు దూరమవుతాయి.
గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలు, చక్కెరవ్యాధి గలవారు ఇతర మాంసాహారాలకు బదులుగా సోయా సంబంధిత పదార్థాలు కొంచెంగా తీసుకోవచ్చును. గర్భిణులు, బాలింతలు సోయాపాలు తీసుకొంటే ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా అందుతాయి. చర్మం పొడిగా కళావిహీనంగా మారితే ప్రతి రోజూ పొద్దుటే శరీరానికి సోయాపాలు రాసుకొని నలుగుపెట్టి స్నానం చేస్తే మంచి వర్చస్సు వస్తుంది.
జాగ్రత్తలు : సోయా గింజలపై పొట్టు కడుపులో వికారాన్ని అజీర్ణాన్ని కలిగిస్తుంది. దానిని తీసి వాడుకోవడం మంచిది. వీటిని బాగా ఉడికించి తీసుకుంటే కడుపునొప్పి అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవు. రోజుకు ఇరవై ముప్పై గ్రాములకు మించి తీసుకోకూడదు.
గమనిక : ఆస్తమా, చర్మ, అజీర్ణ, హార్మోన్ల సమస్యలున్న వారు వైద్యుల సలహా ప్రకారమే వాడుకోవాలి.