బరువు తగ్గాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా, ఈస్ట్రోజన్ లోపాన్ని అధిగమించాలన్నా సోయామిల్క్ మేలంటున్నారు.
సోయాపాలల్లో ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తులు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినందివ్వడమే కాదు. చురుగ్గా పనిచేసేందుకూ తోడ్పడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలస్ట్రాల్ ను తగ్గించడానికి తోడ్పడుతాయి.
ఇందులోని ఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్లు, అత్యంత శక్తివంతమైన ప్లైటో యాంటి ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీని వల్ల ఆరోగ్యమేకాదు, అందం కూడా మీ సొంతమవుతుంది.
సోయా పాలల్లో సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది. కెలరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం. కనుక బరువు తగ్గాలన్నవారికి ఎంతో మేలు. ఈ పాలను త్రాగటం వల్ల శరీరానికి పీచు అందుతుంది. తరచూ ఆకలికూడా కాదు.
మోనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంది. హృద్రోగం, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వీళ్ళని వేధిస్తుంటాయి. సోయాపాలు ఇలాంటివారికి చక్కటి ఉపశమనం. సోయాలోని ఫైటో ఈస్ట్రోజెన్ ఆ హార్మోన్ లోపాలను సవరిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ, చాలామంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియోఫోరోసిస్. ఈ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే సోయాపాలు సరైన పరిష్కారం. ఇందులో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ ఎముకలకు తగిన క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది.