తాటి కాయలు : భారతీయ గ్రామీణ జీవితంలో ఎంతగానే ముడివేసుకున్న చెట్లలో తాటి చెట్టు ఒకటి. తాటి కాయలలో రెండు లేక మూడు ముంజలు ఉంటాయి. ఎక్కువగా మూడు ముంజలుంటాయి. పైన పలుచటి పొరతో లోని తెల్లటి గుజ్జుతో,
కొద్దిగా నీటితో , వగరు తియ్యదనంతో ఉంటాయి. తాటికాయలను కోసి ముంజెలను బయటకు తీసినపుడు అవి చల్లగా ఫ్రిజ్ లో పెట్టిన వాటిలాగా ఉంటాయి. తాటి కాయలు కేవలం ఎండాకాలంలో మాత్రమే కాస్తాయి. తాటి చెట్టు 30 మీటర్ల
ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ
చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. పల్లెలలో తాటి ఆకులను ఇంటి కప్పులకు ఉపయోగిస్తారు. చెట్లకాండాలను చేపలు పట్టే పడవలుగాను మరియు ఇళ్ళ నిర్మాణాలలో వాడతారు. మార్చి,
ఏప్రియల్ మాసాలలో తాటిపండ్లు అందుబాటులో ఉంటాయి. తాటి పండ్లను కోయకుండా చెట్లకు అలాగే ఉంచితే అవి పండుగా మారతాయి. వీటిలో ఉండే గుజ్జు చాలా రుచికరంగా ఉంటుంది. వీటిని నిప్పులమీద గాని, పొయ్యిమీద గాని బాగా
కాల్చి తింటారు. ఈ గుజ్జుతోనే తాటి తాండ్ర తయారు చేస్తారు.
100 గ్రాముల ముంజల్లో 43 కేలరీల శక్తి ఉంటుంది. దీన్లో పోషక విలువలూ ఎక్కువే. విటమిన్-ఎ సమృద్ధిగా ఉంటుంది. బి, సి విటమిన్లూ ఉంటాయి. అరటి పండు స్థాయిలో వీటిలోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. ఇంకా ఐరన్, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలూ ఉంటాయి. ముంజల్లో అధిక శాతం నీరు ఉండటంవల్ల వీటిని తినడంద్వారా డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు. అందుకే పిల్లలూ పెద్దలూ ముంజలు తినాల్సిందే.
వేసవిలో మనం కోల్పేయే విటమిన్లను తాటి ముంజెలు తినటం ద్వారా పొందవచ్చు. తాంటి ముంజెలలో కాల్షియం, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్, ధియామిన్, రిబోఫ్లేవిన్ ఉంటాయి. వేసవి మూడునెలలో తాటిపండ్లను క్రమం తప్పకుండా తింటే ఉదర సమస్యలు, చర్మసంబంధ వ్యాధులు తగ్గుతాయి. ముంజెలను ముఖం మీద రాసుకుంటే నల్లమచ్చలు పోతాయి.
బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా... ఈ సామెత తాటి కాయలకు వర్తించదు. ముదిరిన తాటికాయల్ని కొట్టకుండా చెట్టుకే వదిలేస్తే అవి పండి కిందపడతాయి. పండిన వాటిని నిప్పులమీద లేక స్టవ్ మీద బాగా కాల్చి అందులోని తాటి గుజ్జుని తినొచ్చు. తాటి గుజ్జు మంచి వాసన కలిగి ఉంటుంది. దీనితో బెల్లం, తాటి తాండ్ర కూడా తయారుచేస్తారు. ఈ గుజ్జుతోనే పిండి వంటలూ చేస్తారు. పండి నేల రాలిన తాటికాయల్ని అలాగే వదిలేస్తే వాటిలోని ముంజ ఎండి లేత కొబ్బరి ముక్కలా మారి, బుర్రగుంజు వస్తుంది. లోపల కాస్త మెత్తగా ఉండే దీన్ని కూడా తినొచ్చు. పండిన తాటికాయల్ని ఇసుక నేలలో పాతిపెడతారు. వర్షాకాలంలో అవి మొలకెత్తి తేగలు వస్తాయి. అప్పుడు తేగల్ని టెంక నుంచి వేరుచేసి కాల్చి లేక ఉడకబెట్టి అమ్ముతారు.
ఆ తేగల్ని టెంకల నుంచి వేరుచేయకుండా వదిలేస్తే మొక్కలవుతాయి. ఇన్ని రూపాల్లో తినగలిగేది ఇంకోటి ఉండదేమో! తాటి చెట్లనుండి తాటి కల్లును సేకరిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. తాటి మొద్దులను పల్లెటూళ్లలో ఇళ్లు కట్టుకోవటానికి వాడతారు. తాటాకు ఇళ్లులేని పల్లెటూళ్లు ఉంటాయేమో కానీ, తాటి చెట్టులేని పల్లెటూరు ఉండదు. అయితే మిగతా చెట్లలానే వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఇదివరకు హిందువుల పెళ్లిలో తాటాకు పందిరి వేయటం సంప్రదాయం. తాటిచెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ప్రతి వేసవీ చల్లగా ఉంటుంది! తాటి ఆకులు, మట్టితో కట్టిన ఇళ్లలో నడివేసవి కాలంలో కూడా చల్లగా ఉంటుంది.
తాటి కల్లును నీరా అంటారు. 40 రోజుల పాటు ఉదయాన్నే తాటికల్లును తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందని చెబుతారు.
తాటికల్లు 40 రకాల వ్యాధులకు నివారణగా చికిత్సగా ఉపయోగపడుతుందని చెబుతారు.
తాటికల్లు నుండి తాటి బెల్లం తయారు చేస్తారు. దీనిని మధుమేహ రోగులు కూడా వాడవచ్చంటారు.
తాటిబెల్లంలో అధిక రక్తపోటును తగ్గించే మెగ్నీషియం, పోటాషియం, ఐరన్ ఉంటాయి. ఎండా కాలంలో హాని చేసే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లు తాగకుండా తాటిముంజలు తినటం వలన మనకూ మరియ మన రైతులకు ప్రయోజనం ఉంటుంది.
కూల్ డ్రింక్స్ తాగితే వాటి లాభాలలోని కొంత శాతం విదేశాలలోని ఆ కంపెనీలకు పోతాయి. దప్పిక తీర్చే తాటిముంజలు తింటే మన రైతులకు లాభం.