రామాయణంలోని సీత పాత్రను లవకుశ సినిమాలో అద్భుతంగా పోషించి సీత పాత్రకు అంజలి తప్ప వేరెవరూ న్యాయం చేయలేరన్నంతగా పేరు తెచ్చుకుంది. అనేక జానపద సినిమాలలో తన నటనతో ఆకట్టుకుంది. వాటిలో సువర్ణసుందరి, అనార్కలి చెప్పుకోదగ్గవి. 1936 సం.లో రాజా హరిశ్చంద్ర సినిమాలో చిన్నపాత్ర ధరించి సీనిరంగానికి పరిచయమైంది. తరువాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన బాలరాజు సినిమాలో హీరోయిన్ గా నటించింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించింది. ఈమె అసలు పేరు అంజనీ కుమార్. దర్శకుడు సి. పుల్లయ్య ఈమె పేరును అంజలీదేవి గా మార్చాడు.
జయభేరి, చెంచులక్ష్మి, భక్త ప్రహ్లాద, మహాకవి క్షేత్రయ్య, భీష్మ, జయసింహ, పాడురంగ మహత్యం, బాలనాగమ్మ, మొదలగు పౌరాణిక, జానపద సినిమాలలో నటించింది. కీలుగుర్రం సినిమాలో ప్రతినాయక పాత్రపోషించింది.
బడిపంతులు, తాతా మనవడు వంటి సాంఘిక చిత్రాలలో తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులు మెప్పించింది.
రఘుపతి వెంకయ్య పురస్కారం, రామినేని పురస్కారం, ANR జాతీయ పురస్కారం అందుకొన్నది.
1927 ఆగస్టు 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, పెద్ధాపురంలో జన్మించింది. ఈమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఈమె 2014 జనవరి 13వ తేదీన చెన్నైలో మరణించారు.