గయ్యాళి పాత్రలు పోషించటం తెలుగు సినీరంగంలో సూర్యకాంతం తరువాత ఛాయాదేవి పేరుపొందింది. గుండమ్మకథలో సూర్యకాంతాన్ని గదిలోకి నెట్టివేసి పెత్తనం చెలాయించటం సినీ అభిమానులకు గుర్తుంటుంది. కానీ నిజజీవితంలో వీరిద్దరూ సున్నిత మనస్కులు, మంచివారు. ఇద్దరు తమ ఇంటినుండి తాము చేసిన వంటలు క్యారియర్లలో తెచ్చి తోటినటులకు పెట్టేవారు.
ఛాయాదేవి 1928 సం.లో గుంటూరు జిల్లాలో ఒక మామూలు కుటుంబంలో పుట్టింది. చిన్నతనంలోనే తల్లి దండ్రులు మరణించారు. ఇంట్లో పరిస్థితుల కారణంగా ఇల్లు వదలి బెజవాడ చేరి ఒక నాటక కంపెనీలో చేరింది. బందరుకు చెందిన ఒకరు పరిచయమై ఛాయాదేవిని మద్రాసు తీసుకువెళ్లాడు. ముందుగా 1951లో రత్నదీప, నా ఇల్లు సినిమాలలో నటించింది. తరువాత యన్టీ ఆర్ తన సొంత సినిమాలు పిచ్చి పుల్లయ్య, పాండురంగ మహత్యం లో అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గయ్యాళి పాత్రల నటిగా స్థిరపడింది.
తరువాత మాయాబజార్ సినిమాలో బలరాముని భార్య రేవతీదేవిగా నటించింది. ఛాయాదేవికి డైలాగులు పలకటంలో మంచి పట్టుంది. మాయాబజార్ నుండి ఎన్నో సినిమాలలో నటించింది. ఆదాయంతో పాటు యస్.వి.రంగారావు అండ దొరికింది. సొంతగా ఇల్లు కట్టుకుంది. పిల్లలు లేరు. ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని పెళ్లి చేసి పంపింది.
యస్.వి.రంగారావు అండతో ఫైనాన్స్ వ్యాపారం చేసింది. 1974లో యస్.వి.ఆర్ మరణంతో ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. మానసిక వత్తిడి, డయాబెటిస్ ఈమెను బాధించాయి. అప్పులు తీసుకున్నవారి తిరిగి ఇవ్వలేదు. ఆస్తిని కోల్పోయింది. తెలిసిన వారి కుట్ర మూలంగా తన సొంత ఇంటిలో ఓ చిన్నభాగం మాత్రమే ఛాయాదేవికి దక్కింది. ఈమె డబ్బుతో సినిమాలు చేసి కోట్లు సంపాదించినవారు ఈమెను కనీసం పరామర్శించలేదు. .
మానసికంగా కుంగిపోయిన ఛాయాదేవి 1983 సెప్టెంబర్ నాలుగవ తేదీన పరలోకం చేరింది.