చిత్తూరు నాగయ్య బహుముఖ ప్రజ్ఙావంతుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఇతను 1904 మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. 1965 సం.లో భారతప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. దక్షిణ భారతంలో పద్మశ్రీ బిరుదు పొందిన మొట్టమొదటివాడు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా వీరి కుటుంబం నాగయ్య అమ్మమ్మతో పాటు చిత్తూరు తరలి వెళ్ళారు. దీనితో నాగయ్య ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత చిత్తూరు నాగయ్య అని పిలవసాగారు. ఇతని జీవితాన్ని పరిశీలిస్తే జీవితం మొత్తం చిత్ర విచిత్రమైన మలుపులతో ఉంటుంది. ఇంతటి ఉన్నతి, పతనం మరే నటుడి జీవితంలో ఉండవనటం అతిశయోక్తికాడు.
ఇతనికి చిన్నప్పటి నుండే నాటక రంగం మీద ఆసక్తి ఉండేది. దీనితో ఇతని చదువు కూడా సరిగా సాగలేదు. తరువాత కష్టపడి ఇతరుల సాయంతో బి.ఏ పాసయ్యాడు. 1920లో బి.ఏ చదువుతున్నపుడు స్వాతంత్ర్య ఉద్యమం ముమ్మురంగా సాగుతుండేది. నాగయ్య కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలుగు, తమిళ భాషలలో దేశభక్తి గీతాలు పాడేవాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. మధ్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ లోని వార్ధాకు వెళ్లి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చి అనూహ్యంగా రాజకీయాలను వదలిపెట్టి కళారంగంలో అడుగుపెట్టాడు.
తరువాత చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ సంగీతంలో శిక్షణ పొందాడు. మొదట నాటక రంగంలో ప్రవేశించి నాటకాలలో పాత్రలు ధరించేవాడు. సారంగధర నాటకంలో నాగయ్య వేసిన చిత్రాంగి వేషానికి స్వర్ణపతకం వచ్చింది. చిత్తూరు నాగయ్యకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య మరణంతో రెండవ వివాహం చేసుకోగా కానుపు సమయంలో దురదృష్ట వశాత్తూ ఈమె కూడా మరణించింది. నాగయ్య జీవితం మీద విరక్తితో రమణ మహర్షి ఆశ్రమంలో చేరాడు. తరువాత రమణ మహర్షి అనుమతితో తిరిగి చిత్తూరు చేరాడు.
సినిమా రంగంమీద ఆసక్తితో మద్రాసు చేరుకుని నుంగంబాకంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని అందులో సంగీత సాధన చేస్తూ ఉండేవాడు. తిండికి, బట్టలకు కూడా డబ్బులుండేవి కావు. వేరుశెనగ పప్పు తింటూ, కుళాయి నీళ్లతో కడుపు నింపుకునేవాడు. తరువాత నాటకాలలో వేషాలు వేస్తూ కాస్త డబ్బు సంపాదించ సాగాడు, 1936సం.లో గృహలక్షి అనే సినిమాలో కన్నాంబ సోదరునిగా నటించి ఈ సినిమాలో ‘కల్లు మానండోయ్ బాబు కళ్లు తెరవండోయ్ ’ అనే పాట పాడాడు. ఈపాట అప్పట్లోని ప్రాచుర్యం పొందింది. నాగయ్య మంచి నటుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి నాగయ్యకు రూ.750- రూపాయలు లభించాయి. ఈ చిత్రం ఆర్ధికంగా విజయం పొందింది.
పౌరాణిక పాత్రలు ధరించి మెప్పించటంలో ఎవరైనా చిత్తూరు నాగయ్య తరువాతే. పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు పాత్రలను అద్వితీయంగా పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.
తరువాత 1939లో వందేమాతరం సినిమాలో హీరో వేషం ధరించాడు. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించడంతో నాగయ్యకూడా నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తరువాత సుమంగళిలో ముసలివాని పాత్ర ధరించి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత దేవత, పోతన సినిమాలలో నటించి పేరు, ధనం కూడా సంపాదించాడు. తరువాత ఇతను నటించిన త్యాగయ్య చిత్రం కూడా ఘన విజయం సాధించింది. మైసూరు మహారాజు నాగయ్యకు వెండిపళ్ళెంలో 101 బంగారుకాసులు బహుమతిగా ఇచ్చాడు. తరువాత యోగి వేమన సినిమాలో వేమన పాత్ర పోషించాడు. ఈ సినిమాకూడా విజయవంతమైనది.
తరువాత కోడంబాకంలో 52 ఎకరాల తోటకొని అందులో స్టూడియో నిర్మాణం తలపెట్టి కుదరక ఆర్ధికంగా నష్టపోయాడు. తరువాత రామదాసు సినిమా తీసి మరలా ఆర్థికంగా నష్టపోయాడు. దానధర్మాల వలన కూడా ఆస్తి పోగొట్టుకున్నాడు.
అందరి మాట నమ్మి అందరినీ నమ్మిన నాగయ్య చివరిదశలో దారిద్ర్యం అనుభవించాడు. అత్యధిక పారితోషకం అందుకున్న నాగయ్య పొట్టకూటికోసం కేవలం వందరూపాయలకు కూడా వేషాలు వేసాడు. తన జీవితం ఒక పాఠం అని అందరినీ నమ్మకండి, పనికిమాలిన దాన ధర్మాలు చేయకండని తన ఆత్మకథలో వ్రాసుకున్నాడు.
చివరి దశలో మూత్రసంబంధమైన వ్యాధితో అడయార్ లోని హాస్పటల్ చేర్చబడ్డాడు. నాగయ్య మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరు వెంకటేశ్వరావు‘రఘుపతి రాజారాం’ పాట పాడుతుండగా 1973 డిసెంబర్30వ తేదీన కీర్తిశేషులయ్యారు. నటీ నటుల విరాళాలతో ఇతని అంత్యక్రియలు జరిగాయి.
నాగయ్య మరణానంతరం నాగయ్య మిత్రులు, అభిమానుల సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో నాగయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.