ఈమె అసలు పేరు ప్రమీలా దేవి. తెలుగు సినిమాలకు మార్గదర్శకుడు, ఆద్యుడు రఘుపతి వెంకట నాయుడుకు ఈమె మనుమరాలు. 1943 ఏప్రియల్ 25 తేదీన చెన్నైలో పుట్టింది. తెలుగు, తమిళ సినిమాలలో చేసింది. అప్పట్లోనే అందగత్తెగా పేరుపొందింది.
తన నటనా జీవితాన్ని నాటకాలతో మొదలు పెట్టింది. యన్.టి. రామారావుతో తొలిసారిగా రేచుక్క అనే జానపద సినిమాలో నటించింది. తరువాత నటించిన అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడబ్రతుకు చిత్రాలు ఈమెకు నటిగా గుర్తింపు తెచ్చాయి. కృష్ణావతారం సినిమాలో రుక్మిణిగా నటించింది. నిలువు దోపిడి, భామావిజయం, కర్ణ, రక్తసంబంధం, మహామంత్రి తిమ్మరుసు, దక్షయజ్ఙం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, శాంతినివాసం మొదలగు సినిమాలలో నటించింది.
ఈమె కుమార్తె కనక తమిళ సినిమాల నటి. దేవిక 2002 సం.మే రెండవ తేదీన మద్రాసులోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో మరణించింది.