ధూళిపాళగా సీనీరంగంలో పేరుపొందిన ధూళిపాళ సీతారామ శాస్త్రి తన నటనా చాతుర్యంతో తెలుగు సీనీ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. శకుని పాత్రను అద్భుతంగా పోషింవాడు. సి.యస్. ఆర్ తరువాత శకుని అంటే ధూళిపాళే. శ్రీకృష్ణ పాండవీయంలో శకుని పాత్ర అద్భుతంగా పోషించాడు. ఇతని నటన, వాచకం ప్రత్యేకంగా ఉండేవి.
1922 సెప్టెంబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో జన్మించాడు. చిన్నతనం నుండి నటనమీద ఆసక్తితో నాటకాలు వేసేవాడు. గుంటూరులో సొంతంగా స్టార్ ధియేటర్ ను స్థాపించి నాటకాలు వేసేవాడు. రామారావు నటించిన భీష్మ సినిమాలో దుర్యోధనుని పాత్ర వేసి మొప్పించాడు. తరువాత రామారావు తన సొంత బ్యానర్ లో నిర్మించిన శ్రీకృష్ణపాండవీయంలో శకుని పాత్రను ఇచ్చాడు. ఇది దూళిపాళ జీవితంలో ఒక మైలురాయిగా నిలచింది. తరువాత అనేక పౌరాణిక చిత్రాలలో దుష్ట పాత్రలలో నటించాడు.
కథానాయకుడు, ఆత్మగౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా మొదలగు సాంఘిక చిత్రాలలో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు.
ఇతను చివరి దశలో ఆధ్యాత్మిక రంగం వైపుకు మరలాడు. తనకున్న సంపదను వదలిపెట్టాడు. కంచికామకోఠి పీఠాధిపతి జయేంద్రసరస్వతి నుండి సన్యాస దీక్ష స్వీకరించాడు. అప్పటి నుండి ఇతని వ్యవహారిక నామం శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి. గుంటూరు మారుతీనగర్ లో హనుమ దేవాలయాన్ని నిర్మించి రామాయణం సుందరకాండంను తెలుగులో వ్రాసాడు.
ధూళిపాళ ట్రస్టును స్థాపించి సేవాకార్యక్రమాలు చేపట్టాడు. కళారంగాన్ని పోషించాడు. శేషజీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపి, భారతీయ ధర్మాలకు అనుగుణంగా ఆదర్శవంతంగా జీవించి 2007 సం. ఏప్రియల్ 13వ తేదీన అనారోగ్యంతో మరణించాడు.