జమీందారి పాత్రలు ధరించే జి వరలక్ష్మి 1926వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. తండ్రి కోడి రామమూర్తి సర్కస్ కళాకారుడు. ఇంట్లో పరిస్థితుల వల్ల నాటకాల మీద మక్కువతో 11 సంవత్సరాల వయసులోనే విజయవాడకు చేరింది. అప్పటికి తెలుగు చిత్రరంగానికి రామారావు, నాగేశ్వరరావు రాలేదు. చక్కటి రూపం, గొంతు కలసివచ్చాయి. మొదట్లో సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసింది.
అహంకారం, డబ్బుతో వచ్చిన హుందాతనం, దర్పంగా నడవడం ఈ లక్షణాలు కలిగి ఉన్న పాత్రలకు అప్పట్లో జి.వరలక్ష్మి పెట్టింది పేరు. చిన్న వయసులోనే తన కన్నా పెద్దవారికి తల్లిగా నటించింది.మొదటి సినిమాలో హీరోయిన్ గా పెంకి పాత్రలో నటించింది. ఈ సినిమాలో ప్రఖ్యాత దర్శకుడు ప్రకాశరావు హీరో. ఇతనే తరువాత దర్శకుడుగా పేరుపొందాడు.
తరువాత జి.వరలక్ష్మి సినిమా అవకాశాలకోసం బొంబాయి వెళ్లింది. రెండు సంవత్సరాల తరువాత తిరిగి చెన్నపట్నానికి చేరింది. 1940 చివరిలో ప్రకాశరావుతో ప్రేమలో పడి అతణ్ణి వివాహం చేసుకుంది. ప్రకాశరావుకు ఇది రెండవ వివాహం. ప్రకాశరావు మొదటి భార్య కుమారుడు నేటి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు. రెండవ భార్య జి.వరలక్ష్మి కొడుకు ప్రముఖ సీని ఫోటోగ్రాఫర్ కె.యస్. ప్రకాష్.
తరువాత కాలంలో భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. ఆస్తులు పోయి ఇల్లు కూడా అమ్ముకుంది. కానీ కొడుకు ఫోటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకోవటంతో ఆర్థికంగా పరిస్థితులు బాగుపడ్డాయి. తరువాత శ్రీరాజరాజేశ్వరి కాఫీ క్లబ్, గోరంత దీపం సినిమాలలో నటించింది. తరువాత సీనీ రంగానికి దూరంగా ఉంది. విలాసవంత మైన జీవితం, ఎవరీనీ లెక్కచేయని స్వభావంతో ఈమె తోటివారందరూ దూరంగా పెట్టారు.
చివరి దశలో తన తప్పు తెలుసుకున్నా అప్పటికే సమయం మించిపోయింది. నవంబర్ 26, 2006 సంవత్సరంలో చెన్నైలో మరణించింది.