గుమ్మడిగా పేరుపొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా, తెనాలికి సమీపంలోని రవికంపూడి గ్రామంలో 1928 సం. జులై 9వ తేదీన జన్మించాడు. సుమారు 500 సినిమాలలో నటించిన విలక్షణమైన నటుడు. తండ్రి. అన్న, తాతగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. 1954 సం.లో యన్టీ.ఆర్ తో తోడుదొంగలు సినిమాలో నటించాడు. ఈ సినిమాతో నటుడుగా గుర్తింపు పొందాడు.
1962 సం.లో యన్టీ రామారావు కృష్ణదేవరాయలుగా నటించిన మహామంత్రి తిమ్మరుసు సినిమాలో తిమ్మరుసు పాత్రలో అద్భుతంగా నటించాడు. తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడిని డాక్టరేట్ తో గౌరవించింది. జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. మాయాబజార్, మా ఇంటి మహాలక్షి, కులగోత్రాలు, కులదైవం, మరో మలుపు గుమ్మడికి గుర్తింపు తెచ్చిన సినిమాలు.
ఇతనికి 17 సంవత్సరాల వయసులోనే లక్ష్మీ సరస్వతితో వివాహం జరిగింది. వివాహం తరువాత హిందూ కాలేజ్ లో చేరి సినిమా వ్యామోహంతో ఇంటర్ లో తప్పాడు. తిరిగి స్వగ్రామం చేరి వ్యవసాయం చేయటంతో పాటు నాటకాలు వేసేవాడు. లైబ్రరీలో వీరాభిమన్య నాటకం చదివి, తన స్వంత ఖర్చులతో వీరభిమన్య నాటకం ప్రదర్శించి అందులో ధుర్యోధనుని పాత్రని పోషించాడు.
1950 సం.లో ముక్కామల సహాయకుడిగా అదృష్టదీపుడు సినిమాలో తొలిసారిగా నటించాడు. తరువాత చిన్న చిన్న పాత్రలలో నటించాడు కానీ తగిన గుర్తింపు రాలేదు. తరువాత యన్టీ ఆర్ తో పరిచయం ఏర్పడింది. యన్టీ ఆర్ తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్యలో విలన్ గా అవకాశమిచ్చాడు. అర్ధాంగి చిత్రంలో జమీందార్ వేషం వేసి మంచి క్యారెక్టర్ నటునిగా పేరుపొందాడు. రామారావు, నాగేశ్వరరావుల కంటే వయసులో చిన్న వాడైనా వారిద్దరికి తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు.
పౌరాణిక పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. కర్ణునిగా, ధశరధునిగా, భీష్మునిగా, సత్రాజిత్, బలరామునిగా, నందునిగా నటించి మెప్పించాడు. నమ్మినబంటు, లక్షాధికారి సినిమాలలో విలన్ గా నటించాడు. రాజమకుటంలో కూడా విలన్ గా నటించాడు. మర్మయోగి చిత్రంలో మర్మయోగిగా నటించాడు.
ఇతను బహుసంతానం కలవాడు. అయిదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. తన స్వంత జీవిత చరిత్రను చేదుగుర్తులు, తీపి జ్ఙాపకాలు అని పుస్తకం వ్రాసాడు. సతీమణి వియోగం, కుమార్తె మరణం కొంత బాధించినా తృప్తికరమైన జీవితాన్ని గడిపానని చెప్పుకున్నాడు. 2010 జనవరి 26వ తేదీన హైదరాబాద్ లోని కేర్ హాస్పటల్ లో మరణించాడు.