హరనాధ్ అసలు పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాధ్ రాజు. ఇతను 1936సెప్టెంబర్ రెండవ తేదీన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుకునే రోజులలోనే అనేక నాటకాలలో నటించి బహుమతులు అందుకున్నాడు. ఇతని తొలి సినిమా 1959లో విడుదలైన మా ఇంటి మహాలక్షి. 60వ దశకంలో రోమాంటిక్ హీరోగా పేరుపడ్డాడు. ఇతని పొడగరి మంచి అందగాడు కూడా.
తరువాత యన్.టి.రామారావు నిర్మించిన సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా నటించాడు. భీష్మ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించి తెలుగునాట ప్రముఖ హీరోగా పేరు పొందాడు. లేత మనసులు, చదరంగం, అమరశిల్పి జక్కన్న, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, గుండమ్మ కథ, కథానాయక మొల్ల, చిట్టిచెల్లెలు మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించాడు. మొత్తం 117 తెలుగు సినిమాలు మరియు 12 తమిళ సినిమాలలో నటించాడు. హరనాథ, జమునల కాంబినేషన్ ఆరోజులలో హిట్ జంటగా చెప్పకునేవారు.
చివరి దశలో మద్యానికి బానిస అవటంతో సినిమాల అవకాశాలు తగ్గాయి. చిన్న చిన్న పాత్రలు మాత్రమే వేసాడు. 1989 నవంబర్ 1 వ తేదీన నడివయసులో మరణించాడు