తెలుగు చిత్రరంగంలో అందాల తారగా పేరుపొందిన జయప్రద ఏప్రియల్ 3వ తేదీన, 1962వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. చిన్నపుడే నాట్యం, సంగీతాలలో శిక్షణ పొందింది. 1976లో విడుదలైన భూమికోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు కనిపించింది.
అంతులేని కథ, సిరిసిరిమువ్వ సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. యన్.టి.రామారావు తో నటించిన అడవిరాముడు, యమగోల సినిమాలు విజయవంతంగా ఆడాయి. తరువాత రంగూన్ రౌడి, కమల హసన్ తో కలసి నటించిన సాగర సంగమం ఈమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.
1994 లో యన్టీ రామారావు ఆహ్వానంతో తెలుగు దేశం పార్టీలో చేరింది. 1996లో రాజ్యసభ కు ఎన్నికైంది. తరువాత తెలుగుదేశం పార్టీ నుండి తప్పుకుని సమాజ్ వాది పార్టీలో చేరి 2004లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుండి లోకసభకు పోటీచేసి గెలిచి లోకసభ సభ్యరాలైంది. ఈమె ఉత్తరాది సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడింది.