పసుపులేటి కన్నాంబ తొలితరం సినిమా నటి, గాయకురాలు మరియు నిర్మాత కూడా. 170 సినిమాలలో నటించి 25 తెలుగు మరియు తమిళ సినిమాలకు నిర్మాత కూడా. ఈమె 1911 అక్టోబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో జన్మించింది. ఈమె పుట్టిన తేదీ గురించి సరియైన సమాచారం లేదు. విభిన్నాభిప్రాయాలున్నాయి.
చిన్నతనంలోనే కేవలం పదమూడు సంవత్సరాల వయసులోనే నాటకరంగంలో ప్రవేశించింది. నాటకరంగంలో ఉన్న అనుభవంతో 1935 సం.లో హరిశ్ఛంద్ర తెలుగు చిత్రంలో చంద్రమతి పాత్రను పోషించింది. తరువాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో ద్రౌపది పాత్రను అద్భుతంగా పోషించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను పొందింది.
చరిత్రాత్మక సినిమా పల్నాటి యుద్దంలో నాయకురాలు నాగమ్మ పాత్ర పోషించింది. దక్షయజ్ఙం చిత్రంలో దక్షుని భార్యగా నటించి మెప్పించింది. రాజమకుటం మరియు జగదేక వీరుని కథలో యన్, టి. రామారావు తల్లిగా నటించి మొప్పించారు. లవకుశ సినిమాలో శ్రీరాముని తల్లి కౌసల్యగా నటించింది. కన్నాంబ చక్కని గాయని కూడా. ఆరోజులలోనే కన్నాంబ పాడిన ‘కృష్ణం భజరాధా’ గ్రాంఫోన్ గీతాలు తెలుగువారింటి మారుమోగాయి. చక్కని గంభీరమైన కంఠస్వరం కన్నాంబ సొంతం. ఈమె డైలాగ్ డెలివరీ పదునుగా, అద్భుతంగా ఉంటుంది. నవరసాలను అద్భుతంగా పోషించిన నటీమణి కన్నాంబ.
డ్రామా కంపెనీ నిర్వాహకుకు కడారు నాగభూషణాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనికి ఇది రెండవ వివాహం. తన భర్త కడారు నాగభూషణంతో కలసి రాజరాజేశ్వరి చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి సుమారు 25 తెలుగు, తమిళ సినిమాలు నిర్మించారు. సుమతి, పాదుకా పట్టాభిషేకం, సౌదామిని, పేదరైతు, లక్ష్మి, సతీసక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, నాగపంచమి రాజరాజేశ్వరి నిర్మాణ సంస్థనుండి వచ్చినవే. అప్పట్లో కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు కూడా.
కన్నాంబ ప్రతిరోజూ దేవునికి పూజ చేసినతరువాతే షూ
టింగ్ లకు బయలు దేరేది. కన్నాంబ దంపతులకు పిల్లలు లేరు. ఒక అబ్బాయిని, అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
కానీ విధి విలాసాన్ని ఎవరూ తప్పించలేరు. కన్నాంబ మరణంతో పాటు వీరు ఆస్తులు కూడా పోవటం ఓ వింత పరిణామం. కన్నాంబ భర్త ఓ చిన్న గదిలో నివసించాడు. ఆ గదిలో చిన్న ట్రంకుపెట్టె, కుర్చీ, గొడమీద కన్నాంబ ఫోటో, ఓ టవలు తప్ప ఏమీలేవని అతని మిత్రుడు తెలిపాడు.
1964 మే 7వ తేదీన కన్నాంబ మద్రాసులో మరణించారు. వీరి మతాచారం ప్రకారం ఈమె శవాన్ని నగలతో సహా పూడ్చి పెట్టారు. దొంగలు నగలు కోసం సమాధిని త్రవ్వి కన్నాంబ శవంమీద నగలు దొంగిలించి శవాన్ని కూడా మాయం చేసారంటారు.