తెలుగు సినిమా రంగాన్ని యన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఏలుతున్న రోజులలో వీరి తరువాత హీరోగా గుర్తించబడ్డ నటుడు కాంతారావు. పౌరాణిక పాత్రలైన రాముడు, కృష్ణుడు, జానపద పాత్రలకు రామారావు తరువాత గుర్తింపు పొందిన నటుడు కాంతారావు.
కోదాడ ప్రాంతంలో ఒక కరణీక కుటుంబంలో 1923 నవంబర్ 16వ తేదీన పుట్టాడు. జగ్గయ్యపేటలో చదువుకున్నాడు. ఆ రోజులలోనే సురభివారి నాటకాలలో చిన్న పాత్రతో నాటకాలలో ప్రవేశించాడు. తరువాత సినిమాల మీద మోజుతో చెన్నపట్నం చేరాడు. తొలితరం దర్శకుడు హెచ్ యం. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రతిజ్ఙ సినిమాలో హీరోగా నటించాడు. కానీ తరువాత అవకాశాలు రాకపోవటంతో తిరిగి సొంతఊరు వెళదామనుకుంటున్న దశలో ఎన్టీ ఆర్ హీరోగా నటించిన ‘జయసింహ’లో ఎన్టీ ఆర్ తమ్ముడిగా నటించి గుర్తింపు పొందాడు.
అక్కడనుండి దశాబ్దం పాటు హీరోగా, రెండవ హీరోగా అనేక విజయవంతమైన సినిమాలలో నటించాడు. నారద పాత్రకు తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందాడు. విఠలాచార్య జానపద సినిమాలలో నటించి కత్తి యుద్దంలో తిరుగులేని నటుడిగా పేరుపొంది కత్తి కాంతారావుగా ముద్ర పడ్డాడు. ప్రతిజ్ఙాపాలన, నవగ్రహపూజా మహిమ, జ్వాలాదీప రహస్యం, చిక్కడు దొరకడు, భట్టివిక్రమార్క, అగ్గిదొర, మర్మయోగి ఇంకా అనేక జానపద సినిమాలలో నటించాడు. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, పాండవవనవాసం, లవకుశ పౌరాణిక సినిమాలలో రాముడు, కృష్ణుడు పాత్రల ధరించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇవన్నీ విజయవంతమైన సినిమాలే. చెన్నైలో ఆస్తులు కూడ బెట్టకున్నాడు.
తరువాత సినిమా రంగం మారి పోయింది. కుర్రహీరోలు రావటంతో కాంతారావుకు సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. సొంత సినిమాలు తీసి నష్టపోయాడు. మద్రాస్ లో ఉన్న ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ చేరాడు. సీనీ అవకాశాలు లేవు. చిన్న చిన్న పాత్రలు, సీరియళ్లలో చేసాడు కానీ సరియైన ఆదాయం లేదు. పరిశ్రమలో గుర్తింపు లేదు. చివరి దశలో క్యాన్సర్ బారిన పడ్డాడు. ఏ దురలవాట్లు లేని నటుడు కాంతారావు. కానీ క్యాన్సర్ ముదరటంతో 2009 మార్చి 22న మరణించాడు. సీనీ రంగపు ఆటుపోట్లకు బలైన దురదృష్టవంతుడు. జానపద సినిమాలలో తిరుగులేని హీరో కాంతారావు.
సీని రంగంలో అందరికంటే అత్యధికంగా సుమారు 400 సినిమాలలో నటించిన నటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. 2000 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం రఘుపతి వెంకయ్య పురస్కారంతో కాంతారావును సన్మానించింది.