ఆస్తులున్నప్పుడు జాగ్రత్త పడకపోతే ఏ విధంగా పతనమవుతారనటాని తెలుగు సీనీ రంగంలో ఒక ఉదాహరణగా నిలిచాడు పాతతరం తెలుగు నటుడు కస్తూరి శివరావు. ఇతను రేలంగి, రమణారెడ్డి కన్నా ముందుతరం వాడు. 1913 మార్చి 6వ తేదీన కాకినాడలో జన్మించాడు.
చదువు వంటబట్టలేదు. హార్మోనియం వంటివి వాయించేవాడు. సీనీ రంగంలోకి రాకముందు నాటకాలలో హాస్య పాత్రలు వేసేవాడు పాటలు, పద్యాలు పాడేవాడు. ఇతని గాత్రం బాగుండటంతో అప్పట్లోనే ఇతని పాటలు, పద్యాలు గ్రాంఫోన్ రికార్డులుగా వెలువడ్డాయి. 1941 లో చూడామణి అనే సినిమాలో మంగలి శాస్త్రి అనే పాత్రపోషించాడు. 1948 సం.లో బాలరాజులో నటించి నటుడిగా గుర్తింపబడ్డాడు. ఇతని నటనను ప్రేక్షకులు మొచ్చుకున్నారు.
తరువాత వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్నూ, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి వరుస విజయాలు సాధించటంతో హాస్యనటునిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సొంతంగా పరమానందయ్య శిష్యుల కథ సినిమాను తీసాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో, గిరిజను మొదటి సారిగా హీరోయిన్ గా పరిచయం చేసాడు. దర్శకత్వం కూడా శివరావే.
ఆనాటికే డబ్బు బాగా సంపాదించాడు. నటుడిగా స్థిరపడ్డాడు. ఒకప్పుడు డొక్కు సైకిల్ మీద మద్రాసు వీధులలో తిరిగే ఇతను అప్పటి ధనిక వర్గం తిరిగే ఖరీదైన బ్యూక్ కారులో మద్రాసు వీధులలో తిరిగేవాడు. కానీ జాగ్రత్త పడకపోవటం వలన తన స్థితి కోల్పోయాడు. డబ్బుతో పాటు తాగుడుకు బానిస అయ్యాడు. దీనికితోడు తరువాత సీనీ రంగంలో రేలంగి హవా మొదలయ్యింది. సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఆస్తి కరగి పోయింది. మరలా పాతరోజులు, డొక్కు సైకిలు.
ఇతని పరిస్థితి గమనించి యన్.టి.రామారావు తన సినిమాలలో అవకాశాలిచ్చాడు. కానీ వ్యసనాలకు బానిసగా మారాడు. పొట్టకూటి కోసం కూడా వేషాలు వేయ్యవలసిన స్థితి.
1966 సంవత్సరంలో తెనాలిలో నాటకం వెయ్యటానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తెనాలీ రైల్వే స్టేషన్ లో బెంచి మీద కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తూ అలాగే మరణించాడు. కొన్ని గంటల తరువాత కానీ ఇతనని గుర్తుపట్టారు. శవాన్నీ కారు డిక్కీలో వేసి మద్రాసు పంపించారు. మార్గమద్యమంలో కారు చెడిపోయి మూడు రోజుల తరువాత అతని శవం మద్రాసు చేరుకుంది. సినిమా పరిశ్రమ వారికి ఇతని మరణ వార్త తెలిసింది. కానీ ఇతనికి బాగా తెలిసిన వారే ఇతని చివరి చూపులకు కూడా రాలేదు.
ఆస్తి సంపాదించినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపొవటం, అహంకారం, ఆడంబరమైన జీవితంతం గడపటం వలన తెలుగు సీనీ చరిత్రలో దీనావస్థలో చనిపోయిన మొదటి నటుడు కస్తూరి శివరావు. తరువాత చిత్తూరు నాగయ్య, రాజనాల, టి.యల్ కాంతారావు ఇదే కోవలోకి వస్తారు.