కొంగర జగ్గయ్య రంగస్థల నటుడు, సీనీ నటుడు, రచయిత మరియు పాత్రికేయుడు కూడా. ఆకాశవాణిలో తెలుగు వార్తలు చదివాడు. ఇతని గంభీరమైన కంఠం కారణంగా కంచుకంఠం జగ్గయ్యగా, కళావాచస్పతిగా పేరుపొందాడు. చదువుకునే రోజులలోనే స్వాతంత్ర్యపొరాటంలో పాల్గొన్నాడు. దేశాభిమాని అనే పత్రికకు ఉపసంపాదకుడిగాను, ఆంధ్రారిపబ్లిక్ అనే ఆంగ్ల పత్రికకు సంపాదకుడుగానే పనిచేసాడు.
తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో చేరాడు. యన్.టి.రామారావు ఇతని సహ విద్యార్ధి. ఇద్దరూ కలసి చాలా నాటకాలు వేసారు. చదువు పూర్తయిన తరువాత దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. విజయవాడలో రవి ఆర్ట్స్ ధియేటర్ స్థాపించాడు. యన్.టి.ఆర్ తో కలసి ఎన్నో నాటక వేషాలు వేసి బహుమతులు పొందాడు.
ఇతను మొదటిగా ప్రియురాలు అనే సినిమాలో నటించాడు కానీ అది ఆడలేదు. చాలాకాలం పాటు అవకాశాలు రాలేదు. సినిమాల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసాడు. అర్ధాంగి, బంగారుపాప సినిమాలతో నటుడిగా గుర్తింపు పొందాడు. ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే బంగారుపాపలో వృద్ధునిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. హాస్యనటుడిగా, విలన్ గా, తమ్ముడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. మొత్తం 500 వందల సినిమాలలో నటించాడు.
కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించిన చిత్రంలో బ్రీటీష్ అధికారి రూధర్ ఫర్డ్ గా నటించి ఆ పాత్రకు న్యాయం చేసాడు. అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి మెచ్చుకున్నాడు.
1967లో ఒంగోలు నియోజక వర్గంనుండి లోకసభకు పోటీచేసి 80 వేల మెజారిటీతో నెగ్గాడు. రాజకీయాలలో పాల్గోని గెలిచిన మొదటి నటుడు జగ్గయ్య. సినిమావారంత రామారావు అధ్యక్షతన 1967లోనే మద్రాసులో న్యూ వుడ్ ల్యాండ్ హోటల్ లో జగ్గయ్యను సన్మానించారు.
శివాజీ గణేషన్ తో సహా అనేకమంది నటులకు తన కంచుకంఠంతో డబ్బింగ్ చెప్పాడు. సీనీరంగంలో జగ్గయ్య చేసిన కృషికి భారతప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదునిచ్చింది.
31 డిసెంబర్ 1928 సం.లో తెనాలి దగ్గర ఉన్న మోరంపూడి గ్రామంలో జన్మించాడు. 2004 మార్చి 5వ తేదీన గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు.