పాతతరం నటీమణులలో పేరుపొందిన నటీమణి కృష్ణకుమారి. ఈమె 150 కి పైగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించింది. ఈమె ఆహార్యం, తెలుగు భాషపై పట్టు వలన తెలుగు ప్రాంతానికి చెందినదనుకుంటారు. కానీ ఈమె పశ్ఛిమ బెంగాల్ లోని నౌహతిలో 1933 మార్చి 6వ తేదీన జన్మించింది.
వీరి కుటుంబం మద్రాసుకు మారి స్థిరపడింది. వేదాంతం జగన్నాధం శర్మగారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నది. 1951 సంవత్సరంలో నవ్వితే నవరత్నాలు సినిమాలో హీరోయిన్ పరిచయమైంది. అప్పటికి కృష్ణకుమారి వయసు 16 సంవత్సరాలు మాత్రమే. తరువాత పిచ్చిపుల్లయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈమెకు నటిగా గుర్తింపు తెచ్చిన చిత్రాలు బంగారు పాప, భార్యాభర్తలు, కులగోత్రాలు, లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు. 20 సంవత్సరాల పాటు ఆ నాటి ప్రముఖ హీరోలు యన్.టి.రామారావు, నాగేశ్వరరావు, హరనాధ్, జగ్గయ్య, కాంతారావు వంటి వారితో నటించింది. శాంతినివాసం, పెళ్లికానుక, కులదైవం, పునర్జన్మ, చదువుకున్న అమ్మాయిలు, ఆప్తమిత్రులు, గుడిగంటలు మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించింది. కాంతారావుతోనే 28 జానపద చిత్రాలలో నటించింది. తెలుగు సినిమాల నటి షావుకారు జానకి కృష్ణకుమారికి సోదరి.
కృష్ణకుమారి భర్త బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త అజయ్ మోహన్. ఈ దంపతులకు పిల్లలు లేరు. అనాధాశ్రమం నుండి దీపిక అనే ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. చివరిదశలో ఈమె బెంగుళూరిలోని తమ సొంత ఇంటిలో సంతోషంగా, ప్రశాంతంగా గడిపింది.
ఈమె 2018 జనవరి 24 ఉదయం బెంగుళూరులో మరణించింది.