సీనీ నటుడు నాగభూషణం అంటే ముందుగా అతని సినిమాలు కాకుండా ‘రక్తకన్నీరు’ నాటకం గుర్తుకు వస్తుంది. ఎం.ఆర్. రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్తకన్నీరుగా వ్రాయించి సుమారు రెండువేల ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ నాటకంలో అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగునాట రక్తకన్నీరు నాగభూషణంగా పేరుపొందాడు. రక్తకన్నీరు దేశవ్యాప్తంగా సుమారు 25 సంవత్సరాలపాటు ప్రదర్శించబడి సుమారు 300 మంది కళాకారులకు జీవనోపాధిని చూపింది. సీనీ కళాకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సీనీరంగంలో పేరుపొందాడు.
1952 సం.లో పల్లెటూరు చిత్రం ద్వారా పరిచయమై 1990 దశకం దాకా సీనీరంగంలో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. ఇతని విలనిజం ఇతర విలన్ల నటనకంటే విరుద్ధంగా ఉంటుంది. కన్నింగ్ విలనిజానికి పేరుపెట్టింది ఇతని నటన. హీరోతో ఫైటింగ్ చేయకుండానే విలనిజాన్ని ప్రదర్శిస్తాడు. ఇతని ఒరవడి ఇతని తరువాత నటులు రావుగోపాలరావు, నూతన ప్రసాద్, కోట శ్రీనివాసరావు అనుసరించారు.
రామారావు ఇతన్ని అభిమానించి తన స్వంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లాపెళ్లామా, కోడలు దిద్దిన కాపురం సినిమాలలో వరుసగా పాత్రలు ఇచ్చాడు. బ్రహ్మచారి సినిమాలో సూర్యకాంతంతో కలసి ముసలి పాత్రలో నటించాడు. బాలరాజు కథలో పనిగండం మల్లయ్య పాత్ర పోషించాడు. నాటకాల రాయుడు, ఒకే కుటుంబం సినిమాలు నిర్మించాడు. పేరులోనే భూషణం కాకుండా సీనీరంగానికే ‘నటభూషణం’ గా నిలిచాడు.
1921, మే నెల 19వ తేదీన ప్రకాశం జిల్లాలోని అనకర్లపూడిలో జన్మించాడు. 1995 మే 5న నాగభూషణం కీర్తిశేషులయ్యారు.