తెలుగు సీనీ రంగంలో తన అద్వితీయ, అసమాన్యమైన నటనా చాతుర్యంతో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న నటుడు యన్టీ.రామారావుగా పేరుపొందిన నందమూరి తారక రామారావు. ఇతను సినిమాకు చెందిన బహు రంగాలలో ప్రవీణుడు. దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ కూడా. విశ్వవిఖ్యాత నటసౌర్యభౌముడిగా పేరుపొందాడు. 1968లో భారతప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది
గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లో డిగ్రీ చదువుకున్నాడు. కొంగర జగ్గయ్య ఇతని సహవిద్యార్ధి. వీరిద్దరూ కలసి నాటకాలు వేసేవారు. చదువు పూర్తయిన తరువాత మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సంపాదించాడు. కానీ సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసాడు. మనదేశం సినిమాలో తొలిసారిగా ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించాడు. పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాలతో చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. మద్రాసుకు మకాం మార్చాడు.
1951సంవత్సరంలో రామారావు నటించిన పాతాళభైరవి సినిమా విడుదలైంది. ఈ సినిమా ఇతని జీవితంలో ఒక మైలురాయిగా నిలచింది. పాతాళభైరవి 100 రోజుల పాటు ఆడింది. తరువాత మల్లీశ్వరి, పెళ్లిచేసిచూడు, చంద్రహారం సినిమాలలో నటించి నటుడుగా స్థిరపడ్డాడు. తరువాత మాయాబజార్ సినిమాలో కృష్ణుడి పాత్ర ధరించి ఆంధ్రుల హృదయాలలో కృష్ణునిగా నిలచిపోయాడు. అప్పటి నుండి వెను తిరగలేదు ప్రతి సినిమా హిట్టే. పాండురంగ మహత్వం సినిమాలో పుండరీకుడిగా తన అత్భుతమైన నటనా చాతుర్వాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెలలో పాండురంగని భక్తునిగా నిలచి పోయాడు.
రామారావు రూపం ఏ పాత్రకైనా సరిపోతుంది. పౌరాణిక పాత్రలకు, జానపద పాత్రలకు, సాంఘిక పాత్రలకు సరిపోయింది. ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రలో జీవించే నటనా చాతుర్యం రామారావుది. లవకుశలో రాముని పాత్ర, భూ కైలాస్ లో రావాణాసురుని పాత్రలను చక్కగా పోషించాడు. యుక్తవయసులోనే భీష్మ సినిమాలో భీష్మడు పాత్రను ధరించి నీజంగా భీష్ముని మరపించాడు.
పాండవవనవాసంలో భీమునిగా, శ్రీకృష్ణపాండవీయంలో శ్రీకృష్ణునిగా, దుర్యోధనుని, నర్తనశాలలో అర్జునునిగా పాత్రలు పోషించి తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా పౌరాణాక పాత్రల నాయకునిగా నిలచిపోయాడు.
జయసింహ, జగదేకవీరుని కథ, గులేబాకావళి కథ, మంగమ్మ శపధం, పిడుగురాముడు, కంచుకోట, లక్షీ నివాసం, అగ్గిబరాట, రేచుక్క పగటి చుక్క, రాజమకుటం, మర్మయోగి, రామారావు నటించిన కొన్ని జానపద చిత్రాలు. ప్రతి చిత్రం విజయవంతమైనదే నిర్మాతలకు కాసులు కురిపించినదే. ఆ రోజులలో పల్లెటూర్ల నుండి రామారావు సినిమా చూడటానికి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో ధియేటర్ వచ్చేవారు.
అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ, మిస్సమ్మ, తాతామనవడు, రక్తసంబంధం, గుడిగంటలు, దేవత, తిక్క శంకరయ్య, రాముడు భీముడు, దేవుడు చేసిన మనుషులు, జస్టిస్ చౌదరి, అడవిరాముడు, వేటగాడు రామారావు సాంఘిక చిత్రాలు అన్నీ విజయవంతంగా ఆడినవే. రాజకీయాలలో చేరి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర అపజయం పాలైంది.
బ
రామారావు భార్య బసవతారకం. రామారావుకు మొత్తం పదకొండు మంది సంతానం. ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీరి వారసులు బాలకృష్ణ కూడా సీనీ హీరో. దివంగత హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీ ఆర్ గా స్థిరపడి రామారావు నటనా వారసత్యంగా పొందాడు. ఇంకా కళ్యాణరామ్ కూడా తెలుగు చిత్రాలలో నటిస్తున్నాడు.
1982 మార్చి 29వ తేదీన ‘తెలుగుదేశం’ అనే రాజకీయపార్టీని స్థాపించి 9 నెలలపాటు అవిశ్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు. రెండు సార్లు ప్రత్యర్ధుల కుట్రవలన అధికారం కోల్పోయి తిరిగి ఎన్నికలలో నిలబడి తిరిగి అధికారం చేపట్టాడు. మొత్తం మూడు సార్లుగా మొత్తం 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. కిలో బియ్యం రెండు రూపాయలకు పథకం ప్రవేశపెట్టింది రామారావే. సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేసాడు.
కానీ రాజకీయాలో తన నిరంకుశ ధోరణితో విమర్శలకు గురైనాడు. సీనీరంగానికి శత్రువయ్యాడు. ఇతనిని విమర్శిస్తూ సినిమాలు కూడా వచ్చాయి. ఇతని రెండవ భార్య లక్ష్మీ పార్వతి ప్రభుత్వ విషయాలలో జోక్యం చేసుకున్నదని విమర్శలను ఎదుర్కొన్నాడు. తరువాత తెలుగుదేశం యం.యల్.ఏలు రామారావు అల్లుడు చంద్రబాబుని నాయకునిగా ఎన్నుకోవటంతో అధికారాన్ని కోల్పోయాడు.
రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 1996 జనవరి 18వ తేదీన హైదరాబాద్ లో అస్తమించాడు.