రాజనాలగా పేరుపడ్డ ఇతని అసలు పేరు రాజనాల కాళేశ్వరరావు. 1925 జనవరి 3వ తేదీన నెల్లూరులో జన్మించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో విలన్ అంటే రాజనాలే అనేంతగా ప్రాచుర్యం పొందాడు. మొదట నాటకరంగంలో ప్రవేశించి ఎవరుదొంగ. ప్రగతి అనే నాటకాలను నెల్లూరులో ప్రదర్శించి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని బయట పెట్టినందుకు అప్పటి కలక్టర్ ఆగ్రహానికి గురైయ్యాడు. 1953లో ప్రతిజ్ఙ సినిమాలో విలన్ గా నటించి చిత్రరంగంలో ప్రవేశించాడు. ఫిలాసఫీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ఉన్నత విద్యావంతుడు.
కేవలం 25 సంవత్సరాల వయసులోనే వద్దంటే డబ్బు సినిమాలో యన్.టి.ఆర్ కు మామగా ముసలి జమిందార్ పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. 1966 లో ఇంగ్లీషు సినిమా ‘మాయా ది మాగ్నిఫిషెంట్’ అనే సినిమాలో నటించి హాలివుడ్ లో నటించిన తొలి తెలుగువాడుగా పేరుపొందాడు. ఇతను యన్.టి.రామారావుకు సన్నిహితుడు. 25 సంవత్సరాలపాటు చిత్రరంగంలో తిరుగులేని విలన్ గా పేరుపొందాడు. ఇతని చూపులు కరకుగా ఉండి చూపులతోనే భయపెట్టేవిగా ఉండేవి. కళ్లలోనూ క్రూరత్యం ప్రదర్శించగల మేటి విలన్ రాజనాల.
పిడుగు రాముడు, అగ్గిపిడుగు, ప్రతిజ్ఙ, జయసింహ, జగదేక వీరునికథ, గులేబా కావళి కథ, గుండమ్మ కథ, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, శ్రీకృష్ణ పాండవీయం, గూఢచారి 116 సినిమాలలో విలన్ నటించి పేరుపొందాడు.
45 సంవత్సరాల పాటు అత్యంత వైభవంగా బ్రతికిన రాజనాల చివరిదశలో మాత్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడ్డాడు. ఇద్దరు కుమారులలో ఒకరు మూర్చవ్యాధితో మరణించాడు. ఇంకొకరు బొంబాయి వెళ్లి కనపడలేదు. మద్రాసు నుండి హైదరాబాదుకు వచ్చి అమీర్ పేటలో రూబీ అపార్ట్ మెంట్ లో చిన్నగదిని కొనుగోలు చేసి అందులో భార్యతో కాపురం పెట్టాడు.
షూటింగ్ లో కాలికి దెబ్బ తగిలి ఇన్ ఫెక్షన్ సోకటంతో 1995లో కాలు తొలగించారు. చివరి రోజులలో జ్యోతిష్యం, అష్టసాముద్రికం చెప్పుకుని జీవితం సాగించాడు. మధుమేహంతో భాధపడేవాడు. 1998 మే 21వ తేదీన మరణించాడు.