యస్.వరలక్ష్మి తెలుగు, తమిళ సినిమాల నటి మరియు గాయకురాలు కూడా. ఈమె 1925 ఆగస్టు 13వ తేదీన జగ్గంపేటలో జన్మించింది. తెలుగు సినిమాలు మహామంత్రి తిమ్మరుసు, శ్రీ వేంకటేశ్వర మహాత్యం తమిళ సినిమాలు వీరపాండ్య కట్టబొమ్మన సినిమాలలో ఈమె ధరించిన పాత్రలు, పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. సత్యహరిశ్ఛంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా నటించి తన పాటలు తానే పాడింది.
1937లోనే బాలనటిగా బాలయోగిని సినిమాలో నటించింది. తరువాత పల్నాటియుద్ధం సినిమాతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శివాజీ గణేషన్ తో కలసి నటించిన వీరపాండ్య కట్టబొమ్మన చిత్రం కైరోలో అంతర్జాతీ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. నిర్మాతగా సతీసావిత్రి సినిమాను నిర్మించింది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఈ సినిమాద్వారా తొలిసారిగా పరిచయమయ్యాడు.
బొమ్మా బొరుసాలో అత్తగారి పాత్రలో నటించి మెప్పించారు. శ్రీకృష్ణపాండవీయం, శ్రీకృష్ణావతారం, శ్రీవేంకటేశ్వర మహత్యం, సతీసావిత్రి ఇంకా అనేక సినిమాలలో నటించింది.
ఈమె ఏకైక కుమారుడు మానసికంగా ఎదగలేదు. దీనితో ఎవరినీ కలిసేది కాదు. ఒంటరితనంతో బాధపడేది. చివరి దశలో మంచం మీదనుండి పడి వెన్నుపోటుతో ఆరునెలలు బాధపడ్డారు. 84 సంవత్సరాల వరలక్ష్మి చెన్నైలోని మహాలింగపురంలోని తన సొంత ఇంట్లో 2009 సెప్టంబర్ 22వ తేదీన రాత్రి 11-00 గంటలకు కీర్తిశేషులయ్యారు.