తన అసమాన నటనా ప్రతిభతో, సమ్మోహనమైన రూపంతో, తెలుగునాటనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నిశ్శంకర సావిత్రి 1936 డిసెంబర్ 13వ తేదీన గుంటూరు జిల్లాలోని చిర్రావురులో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో వరుసకు పెదనాన్న ఐన వెంకటరామయ్య ఇంటికి చేరింది. చిన్నతనంలోనే సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చేది.
13 సంవత్సరాల వయసులో నృత్య నాటక పోటీలలో గెలుపొంది, నాటి ప్రఖ్యాత హిందీనటుడు ఫృద్వీ రాజ్ కపూర్ చేతులమీదుగా బహుమతి అందుకుంది. తరువాత సినిమాలమీద ఆసక్తితో మద్రాసు నగరానికి చేరింది. పాతాళ భైరవిలో డ్యాన్సర్ గా ఒక సారి కనిపించింది. పెళ్లిచేసి చూడులో రెండవ కధానాయికగా నటించింది. సావిత్రిలోని అధ్భుతమైన నటన బయటకు వచ్చింది తరువాత నటించిన దేవదాస్ చిత్రంలోని పార్వతి పాత్రతోనే. తరువాత ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిని మిస్సమ్మలో మిస్సమ్మగా యన్.టి.ఆర్ తో కలసి నటించింది. ఈ సినిమా విజయవంతమై సావిత్రికి మంచి నటిగా పేరు తెచ్చింది.
తరువాత నటించిన చిత్రాలు దొంగరాముడు, అర్ధాంగి, చరణదాసి సావిత్రిని నటిగా నిలబెట్టాయి. తరువాత వచ్చిన మాయాబజార్ లో, శశిరేఖగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా సావిత్రి జీవితంలో ఒక మైలురాయి. తరువాత చిన్నారి పాపలు, మాతృదేవత, సంసారం వంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది.
అప్పుచేసి పప్పుకూడు, నాదీ ఆడజన్మే, వరకట్నం, సుమంగళి, దేవత, డాక్టర్ చక్రవర్తి, నర్తనశాల, గుండమ్మకథ, పాండవవనవాసం మొదలగు సినిమాలలో తన అపూర్వమైన నటన ప్రదర్శించింది. కేవలం కళ్లు, పెదాల కదలిక, ముఖ కవళికలతో తన నటనకు ప్రాణం పోసిన మహానటి సావిత్రి. యన్.టి.ర్, ఏ.యన్నార్ లతో పాటు సమానంగా పారితోషకం అందుకుంది.
1956సం.లో తమిళ నటుడు. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు.
కానీ తరువాత ఈ దంపతుల మధ్య విభేదాల కారణంగా సావిత్రి మనశ్శాంతి కోల్పోయి మద్యానికి బానిస అయింది. ఈమె క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. ఇతరులను అనుకరించటంలో నేర్పరి. దానగుణం కూడా కలది. ఒకసారి నగలు అలంకరించుకుని అప్పటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ ను చూడటానికి వెళ్లి, తన వంటిమీద నగలన్నీ తీసి ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చింది.
ఈమె దర్శకత్వం వహించిన చిన్నారిపాపలు, తమిళ మూగమనసులు అపజయం పాలై, ఆస్తులను కోల్పోయింది. టీనగర్ నుండి అణ్ణా నగర్ కు వచ్చింది. అప్పటి నుండి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ తీవ్రనిరాశకు గురై 1981 డిసెంబర్ 26వ తేదీన తన 47వ యేట 19 నెలలపాటు కోమాలో ఉండి కీర్తిశేషులైంది. ఇంతటి మహానటికి ఏ విధమైన అవార్డులు దక్కకపోవటం విచారకరమైన విషయం.
ఈమె జీవిత చరిత్ర ఆధారంగా అశ్విన్ నాగ్ దర్శకత్యంలో ‘మహానటి’ అనే సినిమా తెలుగు, తమిళ భాషలలో తీసారు. విజయవంతమైన ఈ సినిమాలో సావిత్రి పాత్రను నటి కీర్తిసురేష్ పోషించారు. ఈమెకు జాతీయ ఉత్తమనటి పురస్కారం కూడా లభించింది.