తెలుగు సీనీ చిత్రరంగంలో అందాల నటుడిగా పేరుపొందిన శోభన్ బాబు 14 జనవరి 1937 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నందిగామలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఇతనికి చిన్నప్పటి నుండి నాటకాల మీద ఆసక్తి ఉండేది. చదువుకునే రోజులలో నాటాకాలలో వేషాలు వేసేవాడు. గుంటూరు ఏ.సి కాలేజీలో డిగ్రీ దాకా చదువుకున్నాడు. తరువాత లా చదవటం కోసం మద్రాసు చేరాడు. ఒకవైపు చదువుతూనే సినిమాలలో వేషాల కోసం ప్రయత్నించేవాడు.
మొదటగా దైవబలం సినిమాలో రామారావుతో కలసి ఒక చిన్న పాత్ర వేశాడు కానీ గుర్తింపు రాలేదు. తరువాత భక్తశబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించి గుర్తింపు పొందాడు. తరువాత గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ, ప్రతిజ్ఞా పాలన సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు.
తరువాత నర్తనశాలలో అభిమన్యుడిగా, భీష్మలో అర్జునుడిగా, సీతారామకళ్యాణంలో లక్ష్మణునిగా, లవకుశలో శత్రుజ్ఞునిగా, బుద్ధిమంతుడులో కృష్ణునిగా నటించి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వీరాభిమన్యులో అభిమన్యుడిగా నటించి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఈ చిత్రం విజయవంతంగా ఆడింది. తరువాత విడదలైన బంగారు పంజరం విమర్శకుల మొప్పు పొందింది.
శోభన్ బాబు చిత్రాలలో మైలురాయి 1969 లో విడుదలైన ‘మనుషులు మారాలి’. ఇది సిల్వర్ జూబ్లీ చిత్రం. ఈ చిత్రం తరువాత శోభన్ బాబు వెనుతిరగలేదు. ఆగ్రహీరోగా స్థిరపడ్డాడు. తరువాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మండపం, మల్లెపూవు సినిమాలలో నటించాడు.
మానవుడు దానవుడు సినిమాలో మాస్ పాత్రను పోషించాడు. దేవత, పండంటి కాపురం, కార్తీకదీపం లాంటి కుటుంబ కధాచిత్రాలలో నటించి మహిళల అభిమానాన్ని చూరగొన్నాడు. తరువాత ఆడపడుచు, విచిత్ర కుటుంబం, పూలరంగడు, బుద్ధిమంతుడు, మంచిమిత్రులు, ఇద్దరు దొంగలు మొదలగు హిట్ సినిమాలలో ఆగ్రనటులతో పాటు నటించాడు.
ఇతని రూపం సాంఘిక చిత్రాలకే కాకుండా జానపద, పౌరాణిక చిత్రాలకు కూడా సరిపోయింది. సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించి మొప్పించాడు.
శోబన్ బాబుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వీరిని మీడియాకు, సినిమాలకు దూరంగా ఉంచి పెంచాడు. సినిమాలలో డబ్బు సంపాదించినా మిగతా నటులలాగా ఆడంబరంగా జీవించలేదు. చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. దాన, ధర్మాలు చేసాడు కానీ ఎక్కడా చెప్పుకోలేదు. చాలా పొదుపరి. తన కుటుంబంతో చాలా ఆనందంగా గడిపాడు.
తన 59వ యేట సీనీ రంగం నుండి వైదొలగి మిగతా జీవితాన్ని కుటుంబం కోసం గడిపాడు. ఇతను 2008 మార్చి 20వ తేదీన చెన్నైలో మరణించాడు. ఆ నాటి ఆగ్రతారలందరూ శోభన్ బాబు మృతికి సంతాపం ప్రకటించారు.