తెలుగు సీనీ రంగంలో గయ్యాళి పాత్రలకు పేరు పొందిన సూర్యకాంతం నిజ జీవితంలో మాత్రం చాలా సాత్వికురాలు. ఈమె 1924 అక్టోబర్ 28వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని వెంకటకృష్ణ రాయపురంలో జన్మించింది.
సినిమాల మీద ఆసక్తితో మద్రాసు చేరుకుని చిన్న చిన్న వేషాలు వేసేది. సౌదామిని సినిమాలో మొదటిసారిగా గయ్యాళి అత్తగారి పాత్రలో నటించింది. తరువాత నటించిన కోడరికం సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. తరువాత గయ్యాళి పాత్రలకు పేరుపొంది దాదాపు అన్నిసినిమాలలో గయ్యాళి పాత్రలే పోషించింది.
దొంగరాముడు, తొడికోడళ్లు, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు. ముహూర్తబలం మొదలగు హిట్ సినిమాలలో నటించింది. గుండమ్మకథలో ఈమె పోషించిన పాత్ర మరపురానిది, తెలుగు ప్రేక్షకులు మరువలేరు. ఈమె ఎక్కువగా రేలంగితో, రమణారెడ్డితో, యస్.వి.ఆర్ తో జంటగా నటించింది. ఈమె నటనా శైలి ప్రత్యేకంగా ఉంటుంది. హాస్యం నటనలో లేకపోయినా ఈమె హావాభావాలతో నవ్వు వస్తుంది.
షూటింగ్ లకు వెళ్లేటపుడు తన ఇంటినుండి తినుబండారాలు తీసుకువెళ్లి తోటీ నటులకు పెట్టేది. స్వతాహాగా చాలా మంచి మనిషి సూర్యకాంతం. సినిమాపరంగా ఒక సినిమాలో నాగయ్యను పాత్రపరంగా చాలా తిట్లు తిట్టింది. తరువాత నాగయ్య కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంది. చాలా సున్నిత మనస్కురాలు.
ఈమె అందరినీ నమ్మేది కాదు. పారితోషకం దగ్గర మొహమాటంలేకుండా వసూలు చేసుకునేది. 1996 డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ లో ఈమె అస్తమించింది.