యస్.వి.ఆర్ గా పేరుపొందిన రంగారావు అసలు పేరు సామర్ల వెంకట రంగారావు. ఇతను తెలుగు సినిమా రంగంలో విలక్షణమైన నటుడు. నిర్మాత, దర్శకుడు కూడా. రంగారావు 1913 జులై మూడవ తేదీన కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించాడు. మద్రాసు, ఏలూరు, విశాఖ పట్నంలో చదువుకున్నాడు. ఫైర్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు చేరుకున్నాడు. 1946 లో వరూధిని అనే చిత్రం ద్వారా సీని రంగానికి పరిచయమయ్యాడు.
మూడు దశబ్ధాల పాటు దాదాపు మూడువందల తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో నటించాడు. ఆ రోజులలో మాంత్రిక పాత్రలు అనగానే యస్.వి.ఆర్ గుర్తుకు వచ్చేవాడు. బాలనాగమ్మ, పాతాళ భైరవి, భట్టి విక్రమార్క సినిమాలలో మాంత్రిక పాత్రలలో ఇతని నటన మరచిపోలేనిది. యముడంటే సతీసావిత్రి సినిమాలో యస్.వి.ఆరే అనేంతగా పేరుపొందాడు.
రావణుడు, భక్తప్రహ్లాదలో హిరణ్య కశిపుడు, పాండవ వనవాసంలో ధుర్యోధనుడు, దీపావళిలో నరకాసురుడు, నర్తనశాలలో కీచకుడు, మాయాబజర్ లో ఘటోత్కచుడు పాత్రలలో రంగరావు చూపిన నటన ఇతను తప్ప ఆ పాత్రలు వేరొకరు చేయలేరనేంత గొప్పగా ఉంది. నర్తనశాలలో రంగరావు నటనకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. ఈ చిత్రానికి ఇండోనేషియా ఫిల్మిం ఫెస్టివల్ పురస్కారం కూడా లభించింది. బొబ్బిలియుద్ధంలో తాండ్ర పాపారాయిడిగా ఇతని నటన మరువలేనిది. పండంటి కాపురం, బంగారుపాప, సంతానం, గుండమ్మ కథ, తాత మనవడు, మిస్సమ్మ, తొడికోడళ్లు, దసరాబుల్లోడు, ఇంకా అనేక సాంఘిక సినిమాలో తండ్రిగా, అన్నగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.
విశ్వనట చక్రవర్తి, నటసౌర్యభౌమ, నటసింహగా బిరుదులు అందుకున్నాడు. అన్నగా, తండ్రిగా, విలన్ గా రంగారావు నటన తిరుగులేనిది. ఇతని కంఠం గంభీరంగా ఉండి డైలాగులు కూడా వేరొకరికి సాధ్యం కానంత ప్రత్యేకంగా ఉండేవి. గంభీరమైన, నిండైన విగ్రహం యస్.వి.ఆర్ ది.
ప్రజాహితం కోసం విరాళాలు సేకరించి ఇచ్చేవాడు. చైనాతో, పాకిస్తాన్ తో యుద్దం వచ్చినపుడు తోటి నటులతో కలసి విరాళాలు సేకరించి రక్షణ నిధికి ఇచ్చాడు.
విదేశాలలో కూడా ఇతని నటన గుర్తింపు పొందినా స్వదేశంలో మాత్రం తగినంత గుర్తింపు కానీ అవార్డులు రాకపోవటం దరదృష్టం. ఇతను భారతదేశంలో ఆంధ్రరాష్ట్రంలో పుట్టటం ఆంధ్రులకు గర్వకారణం కానీ విదేశాలలో పుట్టి ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరుపొందేవాడు.