header

Agricultural Courses

వ్యవసాయ కోర్సులు
దేశ జనాభాలో ఇప్పటికీ సుమారు 55 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి నూతన, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
దీంతో ఈ రంగానికి అవసరమైన నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. డిమాండ్‌కు తగిన విధంగా నిపుణులను తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలు ఇంటర్ తర్వాత వివిధ వ్యవసాయ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...
వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ అమెరికాలోని లాండ్ గ్రాంట్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్‌లో (ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లా) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 62 విశ్వవిద్యాలయాలు వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన, గృహవిజ్ఞాన రంగాలకు సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 52 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 డీమ్డ్ వర్సిటీలు, 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు 15000 వ్యవసాయ పట్టభద్రులు, 11 వేల మంది పీజీ అభ్యర్థులు బయటకు వస్తున్నారు.
రాష్ట్రంలో...
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్, హైదరాబాద్) వ్యవసాయ విద్యను అందిస్తోంది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్యాన విద్యను, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (తిరుపతి) పశువైద్య విద్యను అందిస్తున్నాయి.
ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఉద్యాన రంగాల సర్వతోముఖాభివృద్ధికి 1964లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1996లో దీన్ని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. వ్యవసాయ కోర్సుల నిర్వహణలో పేరుగాంచిన ఈ వర్సిటీ అందిస్తున్న వ్యవసాయ సంబంధిత కోర్సుల వివరాలు... 1. బీయస్సీ (అగ్రికల్చర్) - (అర్హత: ఇంటర్ బైపీసీ)
2. బీయస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్- (అర్హత: ఇంటర్ బైపీసీ/ ఎంపీసీ).
3. బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - (అర్హత: ఇంటర్ ఎంపీసీ).
4. బీటెక్ (ఫుడ్ సైన్స్)- (అర్హత: ఇంటర్ బైపీసీ/ఎంపీసీ).
5. బీయస్సీ (ఆనర్స్) హోమ్ సైన్స్ - (అర్హత: ఇంటర్ బైపీసీ)
6. బి.యస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ - (అర్హత: ఇంటర్ బైపీసీ)
7. బి.యస్సీ (ఆనర్స్) ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ - (అర్హత: ఇంటర్ బైపీసీ).
ఈ కోర్సుల కాలవ్యవధి 4 సంవత్సరాలు.
బీయస్సీ (ఆనర్స్) హోమ్‌సైన్స్, బీయస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ, బీయస్సీ (ఆనర్స్), ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు మినహాయించి మిగిలిన బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ ర్యాంకు తప్పనిసరి. హోమ్‌సైన్స్ విభాగంలోని కోర్సుల్లోకి కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ ప్రకటన ప్రత్యేకంగా విడుదల అవుతుంది. వర్సిటీ పరిధిలోని కళాశాలలు
• వ్యవసాయ కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, బాపట్ల, మహానంది (కర్నూలు), అశ్వరావుపేట (ఖమ్మం), వైరా (శ్రీకాకుళం), రాజమండ్రి, జగిత్యాల.
• వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు - బాపట్ల, మడకశిర (అనంతపురం), సంగారెడ్డి (మెదక్).
• ఫుడ్ సైన్స్ కళాశాలలు - బాపట్ల, పులివెందుల (కడప).
• హోమ్‌సైన్స్ - గృహవిజ్ఞాన కళాశాల (సైఫాబాదు, హైదరాబాదు.)
ఉపాధి అవకాశాలు: వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు, వ్యవసాయ అభివృద్ధి నిర్వహణ సంస్థలు వ్యవసాయ అధికారులుగా, పర్యవేక్షక నిపుణులుగా అవకాశాలు కల్పిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహకార సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయి. విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మంజూరుకు, బీమా సంస్థల్లో వ్యవసాయ విషయనిపుణులుగా మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. అగ్రి క్లినిక్స్ ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటోంది.
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయా
వ్యవసాయంతోపాటు ఉద్యాన రంగానికి కూడా ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కూరగాయల సాగు, పండ్లతోటలు, పూలు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, ఉద్యానవనాల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. ఈ రంగాల్లో అవసరమైన నిపుణులను అందించేందుకు 2007లో డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వర్సిటీ అందిస్తున్న కోర్సు: బీయస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్ (అర్హత: ఇంటర్ బైపీసీ).
వ్యవధి: నాలుగు సంవత్సరాలు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
చిరునామా: డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం,
తాడేపల్లిగూడెం,
పశ్చిమ గోదావరి జిల్లా.
రాష్ట్రంలోని ఉద్యాన కాలేజీలు: రాజేంద్రనగర్, హైదరాబాద్, వెంకట రామన్నగూడెం, పశ్చిమ గోదావరి, మోజెర్ల, (కొత్తకోట, మహబూబ్‌నగర్), అనంతరాజుపేట వై.ఎస్.ఆర్. కడప).
ఉపాధి అవకాశాలు:
ఉద్యాన విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖలో హార్టీకల్చర్ ఆఫీసర్లుగా ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విత్తన కంపెనీలు ఉద్యానవనాలకు కన్సల్టెంట్లుగా వీరినే నియమిస్తున్నాయి.
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయా
పాడి, పౌల్ట్రీ పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం లాంటి వాటితో పశుసంవర్ధక రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ఈ రంగం పురోగతి కోసం అవసరమైన నిపుణులను అందించేందుకు ప్రభుత్వం 2006లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సంస్థ అందిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు...
బీవీఎస్సీ అండ్ ఎ.హెచ్. - (5 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ బైపీసీ).
2. బీఎఫ్ఎస్సీ- (4 ఏళ్లు, అర్హత: ఇంటర్ బైపీసీ).
3. బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)- (4 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ ఎంపీసీ).
ఎంపిక: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా.
వర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలలు
• పశువైద్య కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, గన్నవరం, విజయవాడ, ప్రొద్దుటూరు (కడప), కోరుట్ల (కరీంనగర్).
• మత్స్య కళాశాల - ముత్తుకూరు, (నెల్లూరు).
• డెయిరీటెక్నాలజీ-కామారెడ్డి(నిజామాబాద్).
ఉపాధి అవకాశాలు:
వెటర్నరీ సైన్స్ (పశు వైద్యం) చదివిన విద్యార్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్ర పశు సంవర్థక శాఖలో పశువైద్యులుగా చేరవచ్చు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, పశువులకు వచ్చేవ్యాధుల నివారణకు ఉపయోగించే ఔషధాలను తయారు చేసే కంపెనీలు తదితర సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.