ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు నిర్వహిస్తోంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు జరిపి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి శిక్షణ తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం ఇస్తారు.ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీకి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు మే/ జూన్, నవంబరు/ డిసెంబరుల్లో వెలువడతాయి.
అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్లు.
కనీసం 157.5 సెం.మీ. ఉండాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి అయిదు రోజులుపాటు రెండు దశల్లో అలహాబాద్, బెంగళూరు, భోపాల్, కపుర్తలాల్లో ఏదో ఒక చోట ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్-1 పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన వారికి మెడికల్ టెస్టు ఉంటుంది. అందులోనూ విజయవంతమైతే తుది శిక్షణకు పంపుతారు.
కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తొలి ఏడాది ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ - గయలో బేసిక్ మిలిటరీ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం టెక్నికల్ ట్రెయినింగ్ నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్-1 కింద ప్రీ-కమిషన్ శిక్షణ మూడేళ్లపాటు ఇస్తారు. ఫేజ్-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్ కమిషన్ ట్రెయింగ్ ఉంటుంది. ఫేజ్-1, ఫేజ్-2 శిక్షణలు సీఎంఈ, పుణె; ఎంసీటీఈ, మావ్; ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు చదువుతారు. మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
ఎన్‌డీఏ, 10+2 టెక్ ఎంట్రీ ఏ విధానంలో ఎంపికైనప్పటికీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ విభాగాన్ని ఎంచుకున్నప్పటికీ శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత మూల వేతనం రూ.56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీసెస్ పే కింద మరో రూ.15,500 అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్మీలో చేరినవారికి లెఫ్టినెంట్, నేవీలో చేరినవారికి సబ్-లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో చేరితే ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు కేటాయిస్తారు. త్రివిధ దళాల్లో ఆఫీసర్ ఉద్యోగానికి ప్రారంభ హోదాలు ఇవే. రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసుకుంటే తర్వాతి స్థాయి ప్రమోషన్ పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో ప్రమోషన్ అందుతుంది. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు అందుతాయి. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు అధిపతులూ కావచ్చు.