header

B.Tech..in Navy…నేవీలో 10+2 (బీటెక్‌)

B.Tech..in Navy…నేవీలో 10+2 (బీటెక్‌)

ఇండియన్‌ నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుతారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నెలకు దాదాపు రూ. లక్షకు పైగా వేతనంతో నేవీలోనే ఉద్యోగిగా కొనసాగవచ్చు. ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబరుల్లో ప్రకటనలు వెలువడతాయి.
ఎంపిక:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ- మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరు, భోపాల్‌, కోయంబతూర్‌, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్‌ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తుదిదశ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు.
అర్హత:
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు.
వయసు: 16 1/2 - 19 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఇతర అర్హతలు: అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in