header

Commerce Education

Commerce Education
ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపులకే కాదు; ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ లాంటి గ్రూపులకు కూడా మంచి ఉపాధి అవకాశాలున్నాయి. కానీ మనరాష్ట్రంలో ఇంజినీర్‌ / డాక్టర్‌ మోజుతో ఎక్కువమంది సైన్సు గ్రూపులనే ఎంచుకుంటున్నారు. కామర్స్‌, ఆర్ట్స్‌ల్లో చేరటానికి ఆసక్తి చూపించే విద్యార్థుల సంఖ్య కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూవస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ప్రవేశించగలిగే విభిన్న కెరియర్‌ మార్గాలను సమగ్ర కథనం!
మనరాష్ట్రంలో ఇటీవలికాలంలో ఎక్కువమంది మొగ్గు చూపుతున్న సైన్సేతర గ్రూపు- ఎంఈసీ. అవగాహన పెరుగుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్యాపరంగా అది అంతగా ప్రతిఫలించటం లేదు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ గ్రూపులో ఇంటర్‌ పూర్తిచేసే విద్యార్థులు ముప్పై వేలు దాటడంలేదు. వీరిలో అధికశాతం సీఏ లాంటి కోర్సులకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో కంటే సీఏ ఫైనల్‌ ఉత్తీర్ణత 25-30 శాతం వరకు పెరిగి, 2013లో మళ్లీ 5-7 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాల్సివుంది. కామర్స్‌ విభాగం అనగానే గతంలో ఎక్కువగా విద్యార్థులు అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ మొదలైన శాఖల్లోకి వెళ్లేవారు. అయితే ఇప్పుడు సాంప్రదాయిక బీకాం రూపంలో అంటే బీకాం (ఎకౌంటెన్సీ)/ బీకాం (మేనేజ్‌మెంట్‌)ల నుంచి కొత్త స్పెషలైజేషన్‌ రూపంలోకి డిగ్రీలు మారుతున్నాయి. ఉదాహరణకు బీఏఎఫ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎకౌంటింగ్‌ & ఫైనాన్స్‌), బీబీఐ (బ్యాచిలర్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ & ఇన్‌స్యూరెన్స్‌), బీఎఫ్‌ఎం (బ్యాచిలర్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌). ఈ విధమైన డిగ్రీలు నేటి సమాజానికి అవసరం కాబట్టి ప్రాచుర్యం ఈ రూపంలో ఎక్కువగా ఏర్పడుతోంది.
అయితే ఈ తరహా కోర్సులకు ఎంపీసీ విద్యార్థులు కూడా అర్హులే కాబట్టి అధికశాతం సీట్లను వారే కైవసం చేసుకుంటున్నారు. ఈ విధంగా డిగ్రీలు పూర్తిచేసినవారికి కూడా 2.5 లక్షల నుంచి 8.5 లక్షల వరకు (సగటున ఏడాదికి 3.5 లక్షల వరకు) వేతనాల అవకాశం ఏర్పడుతోంది.
చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)
శరవేగంగా మారుతున్న వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని, వర్తమాన మానవ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అధికశాతం విద్యార్థులు సీఏ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సీఈసీ, ఎంపీసీ విద్యార్థులు గత 5- 10 సంవత్సరాలుగా ఈ కోర్సు వైపు మొగ్గు చూపుతున్నారు. సీఏ చేయడానికి మొదట సీపీటీ (కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌)ను రాయాల్సి ఉంటుంది. ఇది మన ఎంసెట్‌ లాంటిదని చెప్పవచ్చు. 2012 నుంచి డిగ్రీ స్థాయిలో కామర్స్‌ విభాగంలో 55 శాతం, ఇతర డిగ్రీ విభాగాల్లో 60 శాతం మార్కులు సాధించినవారికి సీపీటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వారు మొదటి దశ అయిన ఐపీసీసీకి నమోదు చేసుకోవచ్చు.
ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు మొదట సీపీటీలో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఇంటర్‌ తర్వాత 60 రోజులకు సీపీటీకి అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబర్‌ నెలల్లో జరుగుతుంది.
సీఏ కోర్సుకు తొలిమెట్టయిన సీపీటీలో 4 పేపర్లుంటాయి. దీనికి 9 నెలల శిక్షణ ఉంటుంది.
ఈ సీపీటీలో అర్హత సంపాదించాలంటే ప్రతి సెక్షన్‌లో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ అన్నీ కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష 200 మార్కులకు జరుగుతుంది కాబట్టి కనీసం 100 మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు. ప్రతి సెక్షన్‌లో 30 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు- ఈ రెండింటిలో ఏది పొందలేకపోయినా ఈ పరీక్ష తప్పినట్లే. మళ్లీ తర్వాత జరిగే సీపీటీకి తయారుకావాల్సివుంటుంది.
సీపీటీ పరీక్ష విధానం
సీపీటీ రెండు విభాగాలుగా ఉండి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో ఉంటుంది. ఒక్కో విభాగం మళ్లీ 2 సెక్షన్‌లతో ఉంటుంది.
ఇక్కడ గమనించదగ్గ అంశం- నెగెటివ్‌ మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులను మొత్తం మార్కుల నుంచి తగ్గిస్తారు.
డిసెంబర్‌- 2012లో 194, జూన్‌- 2013లో 194, డిసెంబర్‌- 2013లో 191 అత్యధిక మార్కులను విద్యార్థులు సాధించారు.
మొత్తమ్మీద డిసెంబర్‌ 2013లో సాధించిన 37.61 శాతం గత 5 సంవత్సరాల్లో పదిసార్లు జరిపిన పరీక్షల్లో ఎక్కువ శాతం అని చెప్పవచ్చు. ఈ కోర్సుకు ప్రాముఖ్యం పెరిగిందనడానికి మరో తార్కాణం పరీక్ష కేంద్రాలు. మొదట 310 ఉండే పరీక్ష కేంద్రాలను ప్రస్తుతం 390గా పెంచారు.
ఆ తర్వాత... ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ). ఇది సీఏ కోర్సులో రెండో దశ. సీపీటీ పూర్తి చేసినవారు దీనికి తమ పేరు నమోదు చేసుకోవాలి. దీనిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉంటాయి. ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. ఈ స్థాయికి కూడా 9 నెలల శిక్షణ ఉంటుంది. కనీసం విద్యార్థి ఒక్క గ్రూపు పాసైనా చాలు.
అసిస్టెంట్‌షిప్‌ (ఫైనల్‌ దశ) అభ్యర్థి ఐపీసీసీ గ్రూపులో అర్హత సంపాదించిన తర్వాత మూడు సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకుని చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌ చేయాలి. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐపీసీసీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు రాసి అర్హత పొందాలి. మిగిలిన 6 నెలల కాలంలో ఆర్టికల్‌షిప్‌ను పూర్తిచేయాలి.
'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా' (ఐసీఏఐ) దేశం మొత్తం మీద నిర్వహించే ఈ తుది పరీక్ష ఉత్తీర్ణత శాతం బహుస్వల్పంగా ఉంటుంది. సీఏ (ఫైనల్‌) నవంబర్‌- 2013 పరీక్ష ఫలితాలు గమనిస్తే 5.73 శాతం మాత్రమే. తుది పరీక్షలో సర్టిఫికెట్‌ పొంది సంస్థలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవాలి. అప్పటి నుంచి అభ్యర్థి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా పూర్తి అధికారిక హోదాలో ఏదైనా కంపెనీలో చేరవచ్చు/ కన్సల్టెన్సీని నెలకొల్పుకోవచ్చు.
దీనిలో భాగంగా 35 గంటల ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ను 100 గంటల కంప్యూటర్‌ శిక్షణను కూడా పొందాలి. ఈ కోర్సును అభ్యసించిన అభ్యర్థులు ఆడిటర్లుగా, టాక్స్‌ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్లుగా బహుళజాతి సంస్థల్లో పనిచేయవచ్చు.. బ్యాంకింగ్‌, ఫారెక్స్‌ (ఫారెన్‌ ఎక్స్‌ఛేంజ్‌) మార్కెట్లలో కన్సల్టెంట్లుగా కూడా వ్యవహరించవచ్చు.
కామర్స్ కోర్సులు
ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు దీటుగా ఆర్ట్స్ విభాగం విద్యార్థులకు ప్రొఫెషనల్ కిరీటాన్ని అందించే కామర్స్ కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ గతిగమనాలను గమనిస్తూ... నిర్దేశిస్తూ... శాసిస్తూ సంతృప్తికరంగా సంపాదించుకునే అవకాశాలను కుప్పలుగా పోస్తున్నాయి ఈ కోర్సులు. పోటీ తక్కువ ఉద్యోగాలు ఎక్కువ. ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివినా ఇందులో చేరవచ్చు.
కొత్త కోర్సులు ఎన్ని వస్తున్నా వన్నె తగ్గని వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆర్థికవ్యవస్థలో మూలస్తంభాలుగా గురుతర బాధ్యతలు మోస్తూ మంచి జీతభత్యాలతో ఉన్నత జీవితాన్ని సాగించాలనుకుంటే కామర్స్ కోర్సులు చదవాల్సిందే. స్థిరమైన జీవితానికి పునాది వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కోర్సుల్లో అందరికీ అందుబాటులో బి.కాం., బి.బి.ఎ., బి.బి.ఎం ఉండగా ప్రొఫెషనల్ కోర్సుల్లో సి.ఎ., సి.ఎస్. మొదలైనవి ఉన్నాయి.
ఐ.సి.ఎ.ఐ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఐ.సి.ఎ.ఐ.కి. పూర్తి రూపం. దేశవ్యాప్తంగా సుమారు 117 బ్రాంచీలున్న ఈ సంస్థ సి.ఎ. కోర్సు అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. దీన్లో మూడు దశలున్నాయి.
1. కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సి.పి.టి.)
ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివినా (చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా) ఆపైన డిగ్రీ చదివిన వారైనా ఈ పరీక్షకు మొదట తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్ పరీక్షలు రాసిన 60 రోజుల తరువాత సి.పి.టి. పరీక్షకు అర్హత పొందుతారు.
ప్రతి సంవత్సరం జూన్- డిసెంబర్‌లో పరీక్ష జరుగుతుంది. దీన్లో 4 పేపర్లుంటాయి. 9 నెలలు శిక్షణ ఉంటుంది.
2. ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (ఐ.పి.సి.సి)
రెండో దశ. సి.పి.టి. పూర్తిచేసిన వారు దీన్లో పేరు నమోదు చేసుకోవాలి. దీన్లో గ్రూప్- 1, గ్రూప్-2 ఉంటాయి. ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేయవచ్చు. 9 నెలల శిక్షణ ఉంటుంది. ఒక గ్రూప్‌లో పాసైనా చాలు. 3. అసిస్టెంట్‌షిప్ (ఫైనల్ దశ)
అభ్యర్థి ఐ.పి.సి.సి. గ్రూప్‌లో అర్హత సాధించిన తరువాత 3 సంవత్సరాల అర్టికల్ అసిస్టెంట్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకుని ఛార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాలి. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తరువాత ఐ.పి.సి.సి. ఫైనల్ గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలు రాసి అర్హత పొందాలి. మిగిలిన ఆరు నెలల కాలంలో ఆర్టికల్‌షిప్‌ను పూర్తిచేయాలి. తుది పరీక్షలో సర్టిఫికెట్ పొంది సంస్థలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవాలి. అప్పటినుంచి అభ్యర్థి ఛార్టర్డ్ అకౌంటెంట్ (సి.ఎ.)గా పూర్తి అధికారిక హోదాలో ఏదైనా కంపెనీలో చేరవచ్చు. లేదా కన్సల్టెన్సీని నెలకొల్పుకోవచ్చు.
భవిష్యత్తు:
ఆడిటర్లుగా, టాక్స్ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా, మల్టీ నేషనల్ కంపెనీలకు పనిచేయవచ్చు. బ్యాంకింగ్, ఫారెక్స్ (ఫారిన్ ఎక్స్‌ఛేంజ్) మార్కెట్లలో కన్సల్టెన్సీలుగా వ్యవహరించవచ్చు. వెబ్‌సైట్: www.icai.org
ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ. పూర్తిరూపం. కంపెనీ లావాదేవీల నిర్వహణలో ఆదాయ, వ్యయ లెక్కింపులో నిపుణులైన అకౌంటెంట్లు కావాలి. అలాంటి వారిని తీర్చిదిద్దడానికి ఏర్పడిందే ఈ సంస్థ. మూడు స్థాయుల్లో కోర్సులను నిర్వహిస్తోంది. 1. ఫౌండేషన్ లెవెల్
దీనికి కనీస అర్హత ఇంటర్. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. మొత్తం నాలుగు పేపర్లుంటాయి. (అవి... అకౌంటింగ్, ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్, ఎకనమిక్స్ అండ్ బిజినెస్ ఫండమెంటల్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్). 2. ఇంటర్మీడియెట్ లెవెల్
దీనికి ఫౌండేషన్ లెవెల్ లేదా డిగ్రీ కనీస అర్హత.
దీన్లో గ్రూప్-1, గ్రూప్-2 పేపర్లు ఉంటాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ లాస్ అండ్ ఆడిటింగ్, అప్లయిడ్ డైరెక్ట్ టాక్సెస్ సబ్జెక్టులుంటాయి.
గ్రూప్-2లో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఆపరేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అప్లయిడ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ సబ్జెక్టులు ఉంటాయి.
3. ఫైనల్ లెవెల్
ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ.కి ఇంటర్ పాసై ఉండాలి. ఇక్కడ గ్రూప్ -3, గ్రూప్-4 పేపర్లు ఉంటాయి.
గ్రూప్-3లో క్యాపిటల్ మార్కెట్ ఎనాలసిస్ అండ్ కార్పొరేట్ లాస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్- స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఇన్‌డైరెక్ట్ అండ్ డైరెక్ట్ టాక్స్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులు ఉంటాయి.
గ్రూప్-4లో మేనేజ్‌మెంట్ అకౌంటింగ్- ఎంటర్‌ప్రైజ్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, కాస్ట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్, బిజినెస్ వాల్యుయేషన్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులుంటాయి. ఓరల్/ పోస్టల్ కోచింగ్ తప్పనిసరి.
ప్రవేశం: సంవత్సరంలో ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు. పరీక్షలు ప్రతిసంవత్సరం డిసెంబరు, జూన్‌లో జరుగు తాయి. శిక్షణ సమయం 6 నెలలు.డిసెంబర్‌లో పరీక్షలకు హాజరు కావాలనుకుంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కోచింగ్ తీసుకోవాలి. జూన్‌లో పరీక్షలు రాయాలనుకుంటే అక్టోబరు నుంచి మార్చి వరకు శిక్షణ తీసుకోవాలి.
బి.కాం.
ఇంటర్‌లో కామర్స్, ఆర్ట్స్ చేసిన వారికి సహజంగా అందుబాటులో ఉండే డిగ్రీ కోర్సు బి.కాం. (కాల వ్యవధి: 3 సంవత్సరాలు). కిరాణా షాపు దగ్గర నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు అకౌంటెంట్‌లు తప్పనిసరి. కాలానుగుణంగా కొన్ని కోర్సులకు డిమాండ్ తగ్గినా, పెరిగినా బి.కాం. చేసిన వారికి అకౌంటెంట్ ఉద్యోగం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంది.
అర్హతలు:
ఈ కోర్సుకు సహజంగా ఇంటర్ సి.ఇ.సి. అభ్యర్థులే ఎక్కువగా దరఖాస్తు చేస్తారు. అయితే ఇతర గ్రూపులవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
బి.కాం. స్పెషలైజేషన్లు:
అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ స్టడీస్, ఇంటర్నేషనల్ బిజినెస్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
బి.కాం. తరువాత పలు రకాల స్పెషలైజేషన్లతో ఎం.కాం. చేయవచ్చు.
భవిష్యత్తు
కామర్స్ డిగ్రీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే డిగ్రీ స్థాయి పోటీ పరీక్షలు అన్నీ రాయవచ్చు. బ్యాంక్‌లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, రైల్వేల్లో టికెట్ కలెక్టర్లు, స్టాటిస్టికల్ డిపార్ట్‌మెంట్‌లో స్టాటిస్టీషియన్, కార్పొరేట్ కంపెనీల్లో అకౌంటెంట్లు, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి.
హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం తదితర రంగాల్లో అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్ విభాగాల్లో చేరవచ్చు.