Telugu Kiranam

Fashion Technology....ఫ్యాషన్‌ టెక్నాలజీ
ఇంటర్‌ తర్వాత ఉద్యోగావకాశాలున్నది ఫ్యాషన్ టెక్నాలజీ రంగం ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్‌ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
నిఫ్ట్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్స్‌: యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌
ఎన్‌ఐడీ: ఇందులో ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి.
యూసీడ్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ సంక్షిప్త రూపమే యూసీడ్‌. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు మరికొన్ని ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డీఈఎస్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు చేసుకోవచ్చు.
ప్రవేశం కల్పించే ముఖ్య సంస్థల్లో ఐఐటీ-బాంబే, గువాహటి; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - కోక్రాజ్హర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - డెహ్రాడూన్‌ తదితరాలు ఉన్నాయి.