header

Footwear Design Courses…. పాదరక్షల తయారీలో…

Footwear Design Courses…. పాదరక్షల తయారీలో…
ఆకర్షణీయమైన పాదరక్షల తయారీలో, రూపకల్పన పరిశోధన రంగంలో ఉద్యోగావకాశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఉద్యోగాలు సంపాదించాలంటే.....ఈ కోర్సులు చేయాలి.
పాదరక్షల తయారీలో నాణ్యమైన మానవ వనరులను సృష్టించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 1986లో ఏర్పాటు చేశారు.
ఈ సంస్థకు హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పాదరక్షలకు సంబంధించి బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు. ఈ సంస్థల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు బాటా...టాటాలతోపాటు పలు కంపెనీల నుంచి తయారయ్యే పాదరక్షలను రూపొందిస్తున్నారు. మరికొంత మంది ఫుట్‌వేర్‌ రిటైల్‌ షోరూమ్‌ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.. పాదరక్షల పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారికి మంచి వేదిక ఎఫ్‌డీడీఐ. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి, ఏప్రియల్ నెలలలో ప్రకటన వెలువడుతుంది.. ఇంటర్‌ అర్హతతోనే బ్యాచిలర్‌ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఆ వివరాలు చూద్దాం.
ఇవీ కోర్సులు
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌/ ప్లస్‌ 2 ఉత్తీర్ణత
వ్యవధి: నాలుగేళ్లు
సీట్ల వివరాలు: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 450, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌ 480, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌ 150, ఫ్యాషన్‌ డిజైన్‌ 420.
ప్రవేశం: జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా.
పరీక్ష
రెండువందల మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు లేదా డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు లేదా డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు.
కోర్సులో...
కోర్సులో వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పిస్తారు. వీటితోపాటు రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, కన్స్యూమర్‌ బిహేవియర్, రిటైల్‌ కమ్యూనికేషన్‌, కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ ఆపరేషన్‌, మార్కెటింగ్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌...మొదలైనవన్నీ నేర్పుతారు.
ఉద్యోగాలిచ్చే సంస్థలు
ఈ సంస్థలో డిజైన్‌ కోర్సులు చేసినవారికి ఎక్కువగా పాదరక్షల తయారీ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఎంబీఏ కోర్సు చదివినవారికి పాదరక్షలు విక్రయించే సంస్థల్లో ఏరియా మేనేజర్‌, ఫ్లోర్‌ మేనేజర్‌, స్టోర్‌ మేనేజర్‌ మొదలైన ఉద్యోగాలు ఉంటాయి. పాదరక్షలు తయారుచేసే, విక్రయించే ఉద్యోగాలు రెండూ ఈ విద్యార్థులకు దక్కుతాయి. అడిడాస్‌, యాక్షన్‌, బాటా, ఫ్యూచర్‌ గ్రూప్‌, గ్లోబస్‌, ఖాదిమ్స్‌, లైఫ్‌స్టైల్‌, ల్యాండ్‌ మార్క్‌, మ్యాక్స్‌, రీబక్‌, లిబర్టీ, రిలయన్స్‌ రిటైల్‌, వెస్ట్‌సైడ్‌, ఉడ్‌ల్యాండ్‌.. మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఇక్కడి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎఫ్‌డీడీఐలో చదువుకున్న దాదాపు ప్రతి విద్యార్థీ కోర్సు పూర్తికాకముందే క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: www.fddiindia.com