ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవాళ్లు, వంటలపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణ నైపుణ్యం కలిగినవారు ...వీరంతా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ఎంచుకోవచ్చు. ఈ రంగంలో నిపుణులకు అవకాశాలున్నాయి
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం)లు ఆతిథ్య రంగంలో ఉత్తమ విద్యాబోధనకు పేరుపొందిన సంస్థలు. ఇవి కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈ సంస్థలను నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) పర్యవేక్షిస్తుంది. ఇవి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అందిస్తున్నాయి.
జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో రెండు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ (హోటల్ మేనేజ్‌మెంట్) కోర్సు అందిస్తున్నాయి. వీటిలో దాదాపు అన్నింట్లోనూ నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. ఇంటర్ ఏ గ్రూప్ విద్యార్థులైనా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు అర్హులే.